గూడు ఏదీ...?(మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, జూన్ 4 (way2newstv.com): 
పేదలందరికీ కూడు గుడ్డతో పాటు గూడూ ఉండాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) ద్వారా పక్కా ఇళ్లు నిర్మించేందుకు 2017 సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మహబూబ్‌నగర్‌, బాదేపల్లి, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ పురపాలికల్లో  ఇళ్ల ఆవశ్యకత (హౌసింగ్‌ డిమాండ్‌) లక్ష్యం పేరిట సర్వే నిర్వహించింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సహకారంతో హైదరాబాద్‌లోని ప్రాంతీయ పట్టణ పరిసరాల పరిశోధన కేంద్రం ఈ డిమాండ్‌ సర్వే చేపట్టింది. దీంతో ఈ ఆరు పట్టణాల్లో ఇళ్ల కోసం అన్ని వర్గాల ప్రజలు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. ఇరవై రోజులపాటు ప్రతి పురపాలిక ఆవరణలో కౌంటర్లు తెరిచి ప్రజల నుంచి ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఆరు పట్టణాల్లో ఇళ్ల కోసం అప్పట్లో 13,958 దరఖాస్తులు అందాయి. అయితే ఈ సర్వే చేసి 20 మాసాలు గడుస్తున్నా అర్హులైన వారికి ఇళ్లు మాత్రం దక్కలేదు.

గూడు ఏదీ...?(మహబూబ్ నగర్)

పీఎంఏవై కింద మహబూబ్‌నగర్‌ పురపాలికలోనే అత్యధికంగా 5,302 మంది దరఖాస్తులు ఇచ్చారు. అత్యల్పంగా బాదేపల్లిలో 756 మంది దరఖాస్తు చేసుకున్నారు. కల్వకుర్తిలో 2,500, అచ్చంపేటలో 2,100, కొల్లాపూర్‌లో 1,800, నాగర్‌కర్నూల్‌లో 1,500 మంది ఇళ్ల కోసం దరఖాస్తులు ఇచ్చారు. దరఖాస్తులు తీసుకున్న సంస్థ ప్రతినిధులు లబ్ధిదారులకు కనీసం రశీదులు కూడా ఇవ్వలేదు. ఇది కేవలం ఇళ్లు అవసరమున్న పేదలను గుర్తించడం కోసం చేస్తున్న డిమాండ్‌ సర్వే మాత్రమేనని, మిగతా విషయాలు తమకు తెలియవని స్పష్టం చేశారు. ఈ ప్రతినిధుల సమాధానంతో మహబూబ్‌నగర్‌ పురపాలికలో దరఖాస్తు దారులు ఒకదశలో గొడవకు సైతం దిగారు. మొదటి రకంలో రూ.3 లక్షలలోపు ఆదాయం కలిగి ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు చెందినవారి నుంచి 30 చ.అ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు స్వీకరించారు. ఈ రకంలో సొంత ఇల్లు ఉన్నా లేకున్నా ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల వరకు బ్యాంకు నుంచి లబ్ధిదారుకు రుణం లభిస్తుంది. తీసుకున్న రుణంలో రూ.1.33 లక్షలు రాయితీ లభిస్తుంది. రెండో రకంలో తక్కువ ఆదాయం కలిగినవారు ఉంటారు. వీరికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయం ఉండాలి. వీరికి 60 చ.అ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణానికి అవకాశం ఉంటుంది. సొంత ఇల్లు గానీ, ప్లాటు గానీ లేకున్నా సరే  బ్యాంకులు రూ.6 లక్షల వరకు రుణం ఇస్తాయి. రూ.2.67 లక్షలు రాయితీ ఇస్తారు. మూడో రకంలో రూ.6 నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఉండాలి. వీరికి 90 చ.అ విస్తీర్ణం వరకు ఇంటి నిర్మాణానికి దరఖాస్తు స్వీకరిస్తారు. రూ.9 లక్షల వరకు రుణం ఇప్పిస్తారు. రూ.2.35 లక్షలు రాయితీ లభిస్తుంది. నాలుగో రకంలో రూ.12 లక్షల నుంచి రూ.48 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారి నుంచి 110 చ.అ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తులు స్వీకరించారు. ఇంటి నిర్మాణానికి బ్యాంకుల నుంచి రూ.12 లక్షల వరకు రుణం ఇప్పిస్తారు. తీసుకున్న రుణంలో రూ.2.30 లక్షల వరకు రాయితీ ఇస్తారు. ఇలా నాలుగు రకాలుగా ఆయా వర్గాల నుంచి ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఈ రోజు వరకు లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపులు చేయకపోవడంతో ఆరు పురపాలికల్లో దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులు తీసుకున్నవారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తే, ఇళ్ల మంజూరులో వీరికి ప్రాధాన్యం ఇవ్వాలి. జిల్లాకు చెందిన దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి అందినా జిల్లాలో మంజూరైన రెండు పడక గదుల ఇళ్ల మంజూరులో ఈ దరఖాస్తుదారులకు ఫ్రాధాన్యం ఇచ్చిన దాఖలాలు లేవు.
Previous Post Next Post