చిన్నమ్మకు ముందే విముక్తి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చిన్నమ్మకు ముందే విముక్తి


చెన్నై, జూన్ 12, (way2newstv.com)
న్నమ్మ శశికళ మరి కొన్ని నెలల్లో జైలు నుంచి బయటకు రాబోతున్నట్టుగా తమిళనాట చర్చ జోరందుకుంది. సత్ప్రవర్తన కారణంగా ఆమెను విడుదల చేయడానికి జైళ్ల శాఖ కర్ణాటక ప్రభుత్వానికి సిఫారసు చేసి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. డిసెంబరులో చిన్నమ్మ విడుదల కావచ్చనట్టుగా అమ్మ శిబిరంలో ఎదురుచూపులు పెరగడం గమనార్హం. ఫిబ్రవరితో చిన్నమ్మ శశికళ జైలు శిక్ష కాలం రెండేళ్లు ముగిసింది. ఈ కాలంలో ఆమె జైలులో నడుచుకున్న విధానాన్ని సత్ప్రవర్తన పరిధిలోకి కర్ణాటక అధికార వర్గాలు తీసుకొచ్చినట్టు సమాచారం. సత్ప్రవర్తనతో వ్యవహరించిన శశికళను ముందస్తుగానే విడుదల చేయడానికి తగ్గట్టుగా కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర జైళ్ల శాఖ సిఫారసు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీని మీద తమిళ మీడియాల్లో వార్తలు రావడంతో ఇక్కడున్న అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాల్లో ఆనందం తాండవం చేస్తోంది. అలాగే, అన్నాడీఎంకేలో ముందస్తు విడుదల అన్నది చర్చకు దారి తీసింది. 


చిన్నమ్మకు ముందే విముక్తి
కర్ణాటక జైళ్ల శాఖ సిఫారసును ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన పక్షంలో తమ చిన్నమ్మ డిసెంబరులో జైలు నుంచి బయటకు రావచ్చనట్టుగా అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. వాస్తవానికి జైలు శిక్ష కాలం 2021లో ముగుస్తుంది.అన్నాడీఎంకేలో ఒకప్పుడు అమ్మ జయలలితతో కలిసి ఆమె నెచ్చెలి, చిన్నమ్మ  శశికళ చక్రం తిప్పిన విషయం తెలిసిందే. 1991–96 కాలంలో వీరి అక్రమార్జనకు హద్దే లేదన్న ఆరోపణలు జోరుగానే సాగాయి. ఇందుకు తగ్గట్టుగా డీఎంకే సర్కారు అధికారంలోకి రావడంతో జయలలితతోపాటుగా చిన్నమ్మ శశికళ, వారి బంధుగణం మీద కేసుల మోత మోగాయి. ఇందులో అక్రమాస్తుల కేసు కూడా ఒకటి. తొలుత తమిళనాట, ఆ తదుపరి కర్ణాటక ప్రత్యేక కోర్టులో ఏళ్ల తరబడి సాగిన ఈ కేసు విచారణ చివరకు సుప్రీంకోర్టుకు సైతం చేరింది.ఎట్టకేలకు ఈ కేసులో సుప్రీంకోర్టు అందర్నీ దోషులుగా తేల్చింది. అయితే, అమ్మ జయలలిత మరణించడంతో, ఆమె పేరును పక్కన పెట్టి చిన్నమ్మ శశికళ, ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ 2017 ఫిబ్రవరిలో కోర్టు తీర్పు ఇవ్వడంతో సీఎం పగ్గాలు చేపట్టాలన్న  ఆకాంక్షతో ఉరకలు తీసిన చిన్నమ్మ శశికళకు కారాగార వాసం తప్పలేదు. ముందుస్తుగానే ఆమెను విడుదల చేయాడానికి సన్నాహాలు సాగుతుండడం వెనుక రాజకీయ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా..? అన్న చర్చ  తమిళనాట ఊపందుకోవడం ఆలోచించాల్సిందే. అయితే, ఆమెను ఎలా సత్ప్రవర్తన కింద విడుదల చేస్తారో అన్న ప్రశ్నను సంధించే వాళ్లూ ఉన్నారు. జైలు జీవితంలో భాగంగా ఆమె ఇష్టారాజ్యంగా షాపింగ్‌కు వెళ్లి వస్తుండడం వంటి వీడియో దృశ్యాలు బయటకు రావడం, గతంలో కర్ణాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు కొందరు ఆ శాఖ డీజీపీ మీదే ఆరోపణలు గుప్పించిన వ్యవహారం కోర్టులో విచారణలో ఉండటం వంటి అంశాలను తెర మీదకు తెస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మ ముందస్తుగా విడుదలైన పక్షంలో తెర వెనుక రాజకీయం తథ్యం అని వ్యాఖ్యానించే వాళ్లు మరీ ఎక్కువే.