కర్నూలు, జూన్ 25, (way2newstv.com)
కర్నూలు జిల్లాలో రైతులు అత్యధికంగా వ్యవసాయ పంటల్లోనే కాకుండా పండ్ల తోటలు, కూరగాయల సాగులో బిందు, తుంపర్ల సేద్యాన్ని వినియోగిస్తున్నారు. అన్ని విధాలా నీటి ఆదాతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకోవడం ఈ సేద్యంలోనే ఉంది. ఎక్కువ మంది రైతులు బిందు తుంపర్ల సాగుకు మొగ్గు చూపుతున్నారు. గడిచిన మూడు సంవత్సరాలలో దాదాపు 1 లక్షా 75 వేల ఎకరాలు పెరిగింది. మొత్తంగా 4 లక్ష 25 వేల ఎకరాల్లో బిందు తుంపర్ల సేద్యం జరుగుతుంది. ఇందులో 50 శాతం ఈ మూడు సంవత్సరాలల్లోనే జరిగిందంటే ఈ సాగు దిశగా రైతులు ఎంతగా ముందుకు వస్తున్నారో అర్థమవుతుంది. వ్యవసాయ రంగంలో వస్తున్న సమస్యలు, తగ్గుతున్న నీటి వనరుల దృష్ట్యా ఈ సాగు ప్రధానంగా నిలుస్తుంది' అని ఉద్యానవన సంయుక్త సంచాలకులు, ఏపి ఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ పుల్లారెడ్డి పేర్కొన్నారు. బిందు తుంపర్ల సేద్యంపై ఆయన పలు విషయాలను వెల్లడించారు. ఇప్పటిదాకా బిందు తుంపర్ల సేద్యం 4 లక్షల 25 వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది.
కర్నూలులో డ్రిప్ ఇరిగేషన్ కు ప్రాధాన్యం
ఇందులో గడిచిన 3 సంవత్సరాలలో 1 లక్షా 75 వేల ఎకరాలు పెరిగింది. అంటే ఎక్కువ మంది రైతులు ఈ సేద్యానికి మొగ్గు చూపుతున్నారు. బోర్లు ఉండి నీటి వనరులు ఉన్న ప్రతి రైతు ఈ సేద్యాన్ని వినియోగిస్తున్నాడు. తగ్గుతున్న నీటి సమస్యకు చక్కని మార్గమే ఈ సేద్యం, డ్రిప్, స్ప్రింక్లరే పద్ధతి.గత సంవత్సరం 55 వేల ఎకరాలు. ఈ సంవత్సరం 68,750 ఎకరాలు లక్ష్యం. అందులో ఇప్పటికే 1750 ఎకరాలు రిజిస్ట్రార్ అయి మంజూరు కూడా చేశామన్నారు.జిల్లాలో మొత్తం 2 లక్షల 92 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగు జరుగుతుంది. వీటికి జాతీయ ఉద్యానవన మిషన్, ఆర్‌కెవివై స్టేట్ ప్లాన్ అనే మూడు రకాల స్కీములు అమలులో ఉన్నాయని...పండ్ల తోటల విస్తరణ, పాత తోటల పునరుద్దరణ, ఫారం ఫాండ్స్, రక్షిత సాగు, ఉద్యానవన ఉయాంత్రికరణ, ఇలా కొన్ని రకాల పద్ధతులను రైతులకు ఉపయోగపడేలా చేస్తున్నామని పుల్లారెడ్డి చెబుతున్నారు.జిల్లాలో ఈ ఏడాది సాధారణ సాగు 30 నుండి 35 వేల హెక్టార్లు ఉంటుంది. అందులో మంచి విత్తనం అందించేందు రైతులకు ఎన్‌హెచ్‌ఆర్‌డిఎఫ్ వారి ద్వారా రెడ్-3, ఎల్-883 రకాలను అందుబాటులో పెట్టాం. వీటికి మంచి ధర వస్తుంది. నాణ్యత గల విత్తనంతో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.ఉల్లి స్టోరేజ్ కేంద్రాలు రైతుల కోసమే ఏర్పాటు చేశాము. ఒక స్టోరేజ్ పరిమాణం 25 మెట్రిక్ టన్నులు. 50 శాతం సబ్సిడీతో ఉల్లి రైతులకు అవకాశం ఇస్తున్నాం. ఎవరికి కావాల్సిన రైతులు ఉద్యానవన అధికారులను సంప్రదిస్తే వారికి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని... కర్నూలు జిల్లాలో కూరగాయలు 33 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇలా కూరగాయలు పండించే రైతులకు హైబ్రిడ్ వెరైటీస్ విత్తనాన్ని అందిస్తాం. రైతులకు టమోటాకు ట్రేలు, తీగ జాతి పంటలకు పందిర్లు శాశ్వత పద్ధతిన ఇస్తాం. తీగ జాతిలో ఒక హెక్టార్‌కు రూ. 2 లక్షల 50 వేల విలువ గల పందిర్లను ఇస్తాం. టమోటాకు 50 శాతం సబ్సిడీతో ఇస్తాం. అంతే కాకుండా విత్తనానికి రూ. 3 వేలు ఇస్తామని పీడీ చెబుతున్నారు.జిల్లాలో అర్హత కలిగిన ప్రతి రైతుకు స్ప్రింక్లర్, డ్రిప్‌లను ఇస్తున్నాం. ఇందులో ఎస్‌సి, ఎస్‌టిలకు 100 శాతం సబ్సిడీతో, మిగతా వారికి 90 శాతం సబ్సిడీతో ఇస్తున్నాం. చిన్న సన్నకారు రైతులకు రూ. 2 లక్షల లోపు, 5 నుండి 10 ఎకరాల్లో రూ. 2.8 లక్షలు, 10 ఎకరాల పైన గరిష్టంగా రూ. 4 లక్షల విలువ గల పరికరాలు ఇస్తాం. ఇందులో ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రతి రైతుకు పారదర్శకంగా అందిస్తామని...జిల్లాలో మామిడి సాగు 9300 హెక్టార్లలో ఉంది. వాతావరణ బీమా కడితే పరిహారం వస్తుంది. రైతులకు వాతావరణ బీమాపై పూర్తి అవగాహన కలిగేలా ప్రచారం నిర్వహిస్తాం. గ్రామాల్లో రైతులకు తెలిసేలా బీమా కట్టించి వాతావరణం ద్వారా నష్టపోతే పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు ఈ విషయాల్లో ఎలాంటి సమస్యలున్నా దగ్గరలోని ఉద్యానవన కార్యాలయంలో అధికారులను సంప్రదిస్తే తగిన పరిష్కారం చూపిస్తారు.