ఎంత సేఫ్..? (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎంత సేఫ్..? (పశ్చిమగోదావరి)

ఏలూరు, జూన్ 3 (way2newstv.com): 
స్కూల్ బస్సుల సామర్థ్యం నిరూపించుకోవాలని రవాణా శాఖ ఇచ్చిన ఆదేశాలను పలు విద్యా సంస్థల యజమానులు బేఖాతరు చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీలోగా వంద శాతం పాఠశాల బస్సులు సామర్థ్య అర్హత ధ్రువపత్రాలు పొందాల్సి ఉంది. మొత్తం 2,300 బస్సుల్లో ఇప్పటి వరకు 200 మాత్రమే ఫిట్‌నెస్‌ పొందాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పరీక్షకు వస్తే బండారం బయట పడుతుందనే ఆలోచనతో చాలామంది సుముఖత చూపడం లేదని ఆరోపణ వినిపిస్తోంది. బస్సుల తనిఖీల్లో అనేక లోపాలు బయటపడటంతో మళ్లీ సామర్థ్య పరీక్షలకు తీసుకురావడం లేదు. ఇంకొన్ని బస్సులను అసలు పరీక్షలకే తీసుకురావడం లేదు. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా చాలా బస్సులను ఎటువంటి సామర్థ్య పరీక్షలు చేయించుకోకుండానే రోడ్లపై తిప్పేస్తున్నారు. ఈ కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుసుములు వసూలు చేసే విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే విద్యా సంస్థల యజమానులు సామర్థ్యం లేని బస్సులను, అనుభవం లేని డ్రైవర్లతో రోడ్డెక్కిస్తూ విద్యార్థుల భద్రతతో చెలగాటమాడుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఎంత సేఫ్..? (పశ్చిమగోదావరి)
స్సుల సామర్థ్య నిర్ధరణకు సంబంధించి నిబంధనల మేరకు అన్ని సక్రమంగా ఉంటేనే ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మే 15 నుంచి జూన్‌ 12వ తేదీలోగా జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల బస్సులు సామర్థ్యం పరీక్షల్లో అర్హత పొందాలని నిబంధనలు చెబుతుండగా, ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. బస్సుల సామర్థ్య పరీక్షలకు విద్యా సంస్థల యాజమాన్యాలు ఆసక్తి చూపడం లేదు. పాఠశాల బస్సు సామర్థ్య పరీక్ష చేయించాలంటే ముందుగా రవాణా శాఖ  వెబ్‌సైట్‌లో చలానా, బస్సు వివరాలను పొందుపరచాలి. ఆ ప్రక్రియ పూర్తయ్యాక బస్సును తనిఖీకి ఏ సమయంలో తీసుకురావాలో వివరాలు వస్తాయి. ఆ మేరకు సంబంధిత రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి సామర్థ్య పరీక్ష పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది.జిల్లాలో ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో ప్రాంతీయ రవాణా కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులు 2,300 ఉన్నాయి. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు చెందిన బస్సులు సామర్థ్య పరీక్షల్లో అర్హత పొందాలని ప్రాంతీయ రవాణాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యేలోగా.. సామర్థ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే బస్సులు రాకపోకలు సాగించాలనే నిబంధనలున్నా పరీక్షల ప్రక్రియ వేగవంతంకాలేదు. కేవలం 200 బస్సులు అర్హత పొందాయి. ఇంకా 2100 బస్సులు అర్హత సాధించాల్సి ఉంది. ఈకారణంగా బడులు తెరిచే నాటికి సామర్థ్యపరీక్షలు పూర్తవుతాయో లేదో అనే అనుమానం వ్యక్తమవుతోంది.