జీరో బడ్జెట్.. (తూర్పుగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జీరో బడ్జెట్.. (తూర్పుగోదావరి)

కాకినాడ, జూన్ 3 (way2newstv.com): 
పెట్టుబడి లేకుండా (జడ్‌బీఎన్‌ఎఫ్‌-జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌) 365 రోజుల పాటు రైతులు ఆదాయం పొందేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతోంది. ప్రతి రైతు తన పొలంలోనే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుని కల్తీలేని పంటలు ..మిగతా 7లోపండించేలా వారిని చైతన్యపర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవడానికి కావలసిన పనిముట్లు, పశువులు కొనుగోలుకు 75శాతం రాయితీతో ప్రభుత్వమే నిధులను సమకూరుస్తోంది జిల్లాలో ఈ ఏడాది చివరి నాటికి లక్షల మంది రైతులను సేంద్రియ సాగుకు మళ్లించే లక్ష్యంతో కార్యచరణ సిద్ధం చేశారు. 2024కు జిల్లా మొత్తం పెట్టుబడిలేని వ్యవసాయం వైపు తీసుకువెళ్లటానికి అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.ఇప్పటికే జిల్లాలో 45వేల మంది రైతులు సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. 

జీరో బడ్జెట్.. (తూర్పుగోదావరి)
వరి, మొక్కజొన్న, మామిడి, జీడిమామిడి, ఇతర కూరగాయల పంటలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. దాదాపు 70వేల ఎకరాల్లో ఈ విధానంలో సాగు చేస్తున్నారని అధికారుల అంచనా. ఈ ఏడాది చివరి నాటికి లక్ష మంది రైతులు మూడు లక్షల ఎకరాల్లో సేంద్రియ సాగు చేసేలా ప్రోత్సహించనున్నారు. మెట్టప్రాంతంలోని జగ్గపేట, తుని, పెద్దాపురం, ప్రత్తిపాడు, రాజానగరం, ఏలేశ్వరం, గోకవరం వంటి ప్రాంతాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సేంద్రియ సాగు చేస్తున్నారు.సేంద్రియ సాగులో భాగంగా పశువుల పేడ, మూత్రంతో సేంద్రియ ఎరువుల తయారీకి అవసరమైన షెడ్ల నిర్మాణం, పశువులు, ఇతర పరికరాల కొనుగోలు నిమిత్తం 75శాతం రాయితీ ఇవ్వనున్నారు. అదే వానపాముల ద్వారా కంపోస్టు ఎరువును తయారు చేసుకోవడానికి 50శాతం రాయితీ ఇస్తారు. మూడు దశల్లో ఈ నిధులను విడుదల చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 40వేల మంది ప్రయోజనం పొందుతుండగా మరో 5వేల మంది రైతులు సొంతగా సాగు చేసుకుంటున్నారు. వీరిని కూడా ఈ పథకం కిందికి తీసుకువచ్చి పూర్తిస్థాయిలో సేంద్రియ వ్యవసాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాలీ క్రాప్‌ పద్ధతి ద్వారా అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో కూడా 365రోజులు వ్యవసాయం చేసేలా అధికారులు మార్పులు తీసుకువస్తున్నారు. అనంతపురం జిల్లాలో చేసిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మొట్ట ప్రాంతంలోని పలు మండలాల్లో ఈ పద్ధతి ద్వారా వ్యవసాయం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. తొలుత కూరగాయల పంటలు పండించి ఆ తరువాత మిగిలిన పంటలకు కూడా ఈ పద్ధతిని తీసుకువస్తారు.