అక్కరకు రాని ఎత్తిపోతల పథకం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అక్కరకు రాని ఎత్తిపోతల పథకం


రాజమండ్రి, జూన్ 18, (way2newstv.com)

దాదాపు దశాబ్దిన్నర క్రితం గోదావరి జిల్లాల్లో చేపట్టిన సాగునీటి ఎత్తిపోతల పథకాల్లో అత్యధికం ఇంకా అక్కరకురాలేదు. రెండు ప్రభుత్వాలు, నలుగురు ముఖ్యమంత్రులు మారినా, నేటికీ ఆయా పథకాల ఆయకట్టు లక్ష్యానికి దూరంగానేవుంది. అంచనాల పెంపునకు తగినవిధంగా ఈ పథకాలు లక్ష్యానికి చేరలేదు. వైఎస్ హయాంలో మొదలైన ప్రాజెక్టులు కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలోకి వచ్చిన తర్వాత అంచనాలు పెరిగాయి, ఆపై వచ్చిన టీడీపీ ప్రభుత్వం హయంలో అంచనాలు పెరిగినా నిర్ధేశిత ఆయకట్టుకు సాగునీరు దక్కలేదు.పశ్చిమ గోదావరి జిల్లా తాడిపూడి ఎత్తిపోతల పథకంలో 14 మండలాల్లోని 127 గ్రామాలకు చెందిన 5.4 లక్షల జనాభాకు తాగునీరు, 2లక్షల 6వేల 600 ఎకరాల ఆయకట్టుకు 12.5 టీఎంసీల నీటిని సరఫరాచేయడానికి ఈ పథకాన్ని ఉద్ధేశించారు. 2003 మార్చి 27న రూ.295.08 కోట్లకు పరిపాలన ఆమోదం లభించిన ఈ పథకాన్ని 2009లో సవరించిన అంచనాల ప్రకారం మొత్తం రూ.467.80 కోట్లతో చేపట్టారు. ఇంకా పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించడం అనుమానంగానేవుంది. 


అక్కరకు రాని ఎత్తిపోతల పథకం

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు వద్ద అఖండ గోదావరి ఎడమ గట్టుపై కాటన్ బ్యారేజికి ఎగువన నిర్మించిన వెంకటనగరం ఎత్తిపోతల పథకం ఇంకా ఉత్తిపోతల పథకంగానేవుంది. 4250 ఎకరాల పాత ఆయకట్టుకు అనుబంధంగా 34 వేల ఎకరాలకు నిర్ధేశిస్తూ 3.62 టీఎంసీల గోదావరి నీటిని తోడుకునే విధంగా 2008 మార్చి 5న రూ.124.18 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకాన్ని 2014లోనే పూర్తిచేయాల్సివుంది. నేటికీ పూర్తికాలేదు. ఆయకట్టు కాగితాలకే పరిమితమై అతీగతీ లేకుండావుంది. జలయజ్ఞంలో భాగంగా పూర్తిగా గిరిజన రైతుల కోసం ముసురుమిల్లి, భూపతిపాలెం రిజర్వాయర్ పథకాలు చేపట్టారు. ఇందులో ముసురుమిల్లి రిజర్వాయర్ ద్వారా 22వేల 643 ఎకరాల ఆయకట్టు కోసం ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. 2.534 టీఎంసీల జలాలను వినియోగించుకునేలా 2004 సంవత్సరంలో రూ.207 కోట్లతో చేపట్టారు. అనంతరం 2006లో జీవో నెంబర్ 1142 ప్రకారం రూ.11.65 కోట్లుతో కలిపి రూ.218.65 కోట్లతో పనులుచేశారు. ఆ తర్వాత సవరించిన అంచనాలతో రూ.236.78 కోట్లతో ఈ పథకం 2015కి పూర్తి చేయాల్సిందిగా నిర్ధేశించారు.ఇప్పటికీ పూర్తిస్థాయిలో పనులు పూర్తి కాలేదు. ఆయకట్టు కూడా అయోమయంగావుంది. భూపతిపాలెం రిజర్వాయర్ ప్రాజెక్టును 14వేల 28 ఎకరాల కోసం రూపొందించారు. 1.151 శతకోటి ఘనటడుగుల నీటిని వినియోగించుకుని గిరిజన రైతులకు సాగునీరు అందించడానికి ఈ పథకాన్ని రూపకల్పనచేశారు. 2007లో జీవో నెంబర్ 218 ప్రకారం రూ.187.91 కోట్ల అంచనాతో పరిపాలన ఆమోదం ఇచ్చారు. ఈ పథకాన్ని 2012 జూలై 14న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. అప్పట్లో మిగిలిన పనులకు రూ.20 కోట్లు కూడా మంజూరయ్యాయి. పూర్తి ఆయకట్టు దక్కలేదు. గిరిజన పొలాలకు సాగునీరు అందడం లేదు. డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పూర్తిగా ఏర్పడలేదు. జలయజ్ఞ పథకాలకు సంబంధం లేకుండా గతంలో ఎపుడో నిర్మించిన చాగల్నాడు ఎత్తిపోతల పథకం కూడా నిర్ధేశిత లక్ష్యం మేరకు నేటికీ ఆయకట్టు దక్కలేదు. 35వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూపొందించారు. 1999లో జీవో నెంబర్ 20 ప్రకారం రూ.61.23 కోట్లతో చేపట్టారు. 2002లో ఆ ప్రాజెక్టు రూ.70.77 కోట్లతో పూర్తిచేశారు. నేటికీ పూర్తిస్థాయిలో ఆయకట్టు దక్కలేదు. సూరంపాలెం రిజర్వాయరు ప్రాజెక్టును 14వేల 150 ఎకరాలకు సాగునీరు అందించడానికి రూపొందించి, అనంతరం ఆయకట్టును కుదించారు. బురద కాల్వపై ఈ ప్రాజెక్టు నిర్మించడానికి జీవో నెంబర్ 163 ప్రకారం 2004లో పరిపాలనా ఆమోదం ఇచ్చి రూ.51.38 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత రూ.69.74 కోట్లతో పూర్తిచేశారు. ఈ పధకం ద్వారా 730 మిలియన్ ఘనపు అడుగుల నీటిని వినియోగించుకునేలా రూపొందించారు. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలకు సంబంధించి నిర్ధేశిత లక్ష్యం మేరకు ఆయకట్టు దక్కని వైనంపై ప్రస్తుత ప్రభుత్వం పరిశీలన చేపట్టినట్టు తెలుస్తోంది.