20న చంద్రయాన్ ప్రయోగం.? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

20న చంద్రయాన్ ప్రయోగం.?

నెల్లూరు, జూలై 17 (way2newstv.com)
చంద్రయాన్-2 ప్రయోగం తిరిగి ఈ నెల 20న నిర్వహించడానికి  సిద్ధమౌతోంది.  రద్దుకు కారణమైన సాంకేతిక సమస్యను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఎట్టకేలకు కనుగొన్నారు. చంద్రునిపై పరిశోధనలు జరిపేందుకు సోమవారం ఉదయం 2.51 గంటలకు తలపెట్టిన ఈ ప్రయోగాన్ని 56 నిమిషాల 24 సెకన్ల ముందు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అందరినీ నిరుత్సాహపరిచిన ప్రయోగం రద్దుకు కారణమైన సమస్యను గుర్తించినట్లు ఓ సీనియర్ శాస్త్రవేత్త వెల్లడించారు. బాహుబలి వ్యోమనౌక జీఎస్‌ఎల్వీ-మాక్3లోని క్రయోజెనిక్ ఇంజిన్‌లో లీకేజీ జరుగుతుండటాన్ని పసిగట్టామని ఆయన తెలిపారు. 
 20న చంద్రయాన్ ప్రయోగం.?

ఆక్సిడైజర్‌కు, ఇంధనానికి ఒత్తిడి (ప్రెషర్)ను సరఫరా చేసే హీలియం బాటిల్ జాయింట్ వద్ద లీకేజీ జరుగుతుండటాన్ని గుర్తించామని చెప్పారు. ఏం జరిగిందో తెలుసుకున్నప్పటికీ అది ఎందుకు జరిగిందన్న దానిని గుర్తించేందుకు ఇస్రో ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నారు. రాకెట్‌ను పూర్తిగా విడగొట్టకుండానే లీకేజీని అరికట్టగలిగామని ఆ శాస్త్రవేత్త తెలిపారు. వ్యోమనౌకలోని ఆక్సిజన్ ట్యాంక్ పైన ఉన్న గ్యాస్ బాటిల్ వద్దకు చేరుకొనేందుకు ఒక ద్వారం ఉన్నదని, అక్కడికి వెళ్లి లీక్ అవుతున్న జాయింట్‌ను సరిచేశామని చెప్పారు. అయితే లీకేజీ ఎందుకు జరిగిందన్న కారణాన్ని కనుగొనాల్సి ఉందని, లేకపోతే మరోసారి లీకేజీ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను అమర్చిన రాకెట్‌ను విడగొట్టాల్సిన పని లేదు గనుక ఈ నెలాఖరులో ప్రయోగాన్ని చేపట్టే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రయోగం రద్దుపై విశ్లేషణ నివేదిక ఒకటి రెండు రోజుల్లో అందుతుందని, ఆ తరువాతనే నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. గ్యాస్ బాటిల్‌లో 34 లీటర్ల హీలియం ఉంటుంది. ఆ బాటిల్ నుంచి వెలువడే ప్రెషర్‌ను తొలుత 350 బార్‌ల వరకు పెంచుతారు. ఆ తరువాత ఆ ప్రెషర్‌ను 50 బార్ల వద్ద క్రమబద్ధం చేస్తారు. జరిగిన లీకేజీ వల్ల.. నిమిషానికి నాలుగు బార్ల చొప్పున ప్రెషర్ తగ్గడం ప్రారంభమైంది. అయినప్పటికీ రాకెట్ నింగిలోకి దూసుకొనిపోయేది. కానీ ఆ చిన్న లోపంతో రూ.978 కోట్ల ప్రాజెక్టు ప్రయోగం చేపట్టరాదని నిర్ణయించాం అని ఓ అధికారి పేర్కొన్నారు. ఒకవేళ గ్యాస్ బాటిల్‌లో లీకేజీ పెద్దగా ఉంటే.. అది ఇంధన దహన క్రియను, వేగాన్ని దెబ్బతీయడంతోపాటు, రాకెట్ కూడా నియంత్రణలో లేకుండా పోతుందన్నారు.