ఈ నెల 28, 29వ తేదిల్లో.. చింతమడకలో వైద్య శిబిరం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఈ నెల 28, 29వ తేదిల్లో.. చింతమడకలో వైద్య శిబిరం

 జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఓ, యశోధా ఆసుపత్రి జీఎంతో మాజీ మంత్రి హరీశ్ సమీక్ష 
సిద్ధిపేట, జూలై 26 (way2newstv.com)
సమగ్ర ఆరోగ్య సూచిక సీఎం కేసీఆర్ స్వగ్రామం నుంచే పునాది అవుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, డీఎంహెచ్ఓ అమర్ సింగ్, యశోధా ఆసుపత్రి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి చింతమడక గ్రామంలో నిర్వహించనున్న వైద్య శిబిర నిర్వహణ అంశం పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా గ్రామంలోని ప్రతి ఒక్కరికీ వైద్య ఆరోగ్య పరీక్షలు చేపట్టి ఆరోగ్యపరమైన నివేదిక రూపొందించాలని కోరిన దరిమిలా ఆ దిశగా అడుగులు వేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. 
ఈ నెల 28, 29వ తేదిల్లో.. చింతమడకలో వైద్య శిబిరం 

రాష్ట్రంలోనే హెల్త్ ఫ్రోఫైల్ రూపొందించిన తొలి గ్రామంగా చింతమడకను చేస్తామని సీఎం చెప్పారని, అదే రోజున యశోధ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారని పేర్కొన్నారు. ముందుగా ఆరోగ్య పరీక్షలు, ఆ తర్వాత కంటి పరీక్షలు చేయాలని చర్చించారు. గ్రామంలో 1800 కుటుంబాలు ఉన్నాయని., ఆయా కుటుంబాల్లోని ప్రతి మనిషి యొక్క వైద్య పరీక్షలు, వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయాలని నిర్ణయించిట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, డీఎంహెచ్ఓ అమర్ సింగ్, యశోధ ఆసుపత్రుల జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డిలు హరీశ్ రావుతో చర్చించారు. గ్రామంలో పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు చేయించాల్సి ఉన్నదని వివరించారు. ఇందు కోసం ప్రతి 20 గృహాలకు ఒక్క ఏఎన్ఎం ను నియమించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. 70 మంది వైద్య బృందంతో 3 రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించ తలపెట్టినట్లు యశోధ ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. ఈ మేరకు ఈ నెల 28, 29, 30వ తేదిలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య శిబిరం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని యశోధా ఆసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిక వర్గాలను ఆదేశించారు. 28, 29వ తేదిలు ఆదివారం, సోమవారం రెండు రోజులు చింతమడకలో వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు, ఈ శిబిరానికి అంకంపేట, సీతారాంపల్లి గ్రామస్తులు కూడా వచ్చేలా ఏర్పాట్లు చేపట్టాలని వైద్య వర్గాలను ఆదేశించారు. అదే విధంగా 30వ తేది మంగళవారం రోజున మాచాపూర్ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించేలా చర్యలు చేపట్టాలని హరీశ్ రావు సూచించారు. ఎక్కడా లోటుపాట్లు రాకుండా కావాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీఎంహెచ్ఓకు సూచించారు. ఈ సమీక్షలో జెడ్పీ సీఈఓ శ్రవణ్, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, ఎంపీడీఓ సమ్మిరెడ్డి, డాక్టర్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.