చంద్రయాన్ 2 సక్సెస్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రయాన్ 2 సక్సెస్

అంతరిక్ష చరిత్రలో భారత్ రికార్డ్
నెల్లూరు, జూలై 22 (way2newstv.com)
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. 20 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2.43 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎ‌ల్వీ రాకెట్ 3.8 టన్నుల బరువుగల చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరిన 16.13 నిమిషాల తర్వాత చంద్రయాన్-2 నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించింది. అనంతరం రాకెట్ నుంచి చంద్రయాన్‌-2 ఉపగ్రహం విడిపోయింది. చంద్రయాన్‌-2ను చంద్రుడి ఉపరితలంలోని దక్షిణ ధ్రువంలోకి ప్రవేశ పెట్టడమనేది అత్యంత క్లిష్టమైన అంశం.
చంద్రయాన్ 2 సక్సెస్

ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సంపూర్ణ నైపుణ్యం సాధించాలని కోరుకుంటున్న ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానమిది. చంద్రుడిపై క్లిష్టమైన సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ఇస్రో చేస్తున్న మొదటి ప్రయత్నం ఇది. ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌, రోవర్‌ విడిపోయిన తరువాత 15 నిమిషాలు అత్యంత కీలకమైందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రయాన్-2 చంద్రుడిపై దిగిన తర్వాత అందులోని రోవర్‌ సెకనుకు సెంటీమీటరు వేగంతో 14 రోజుల పాటు పయనించనుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి సమాచారాన్ని, చిత్రాలను పంపనుంది. చంద్రుడిపై జల, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి ఇది పరిశోధనలు చేయనుంది. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని జులై 15న తెల్లవారుజామున చేపట్టాల్సి ఉండగా ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం గుర్తించి వాయిదా వేశారు. ఈ సమస్యను పరిష్కరించిన శాస్త్రవేత్తలు ప్రయోగం సోమవారం నిర్వహించారు. చంద్రయాన్‌-2 ప్రయోగానికి అనువైన లాంచ్ విండో ఒక నిమిషమే కావడం విశేషం. ఈ స్వల్ప సమయంలోనే ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. ఇస్రో చైర్మ‌న్ శివ‌న్‌తో పాటు ఇత‌ర శాస్త్ర‌వేత్త‌లు మిష‌న్ కంట్రోల్ రూమ్ నుంచి చంద్ర‌యాన్‌-2 ప్ర‌యోగాన్ని వీక్షించారు. వీవీఐపీలు కూడా ఎక్కువ మందే ఈ ఈవెంట్‌ను ప్ర‌త్య‌క్షంగా చూశారు. అత్యంత శ‌క్తివంత‌మైన ఈ రాకెట్ సుమారు 43.5 మీట‌ర్ల ఎత్తు ఉన్న‌ది. చంద్ర‌యాన్‌లో విక్ర‌మ్ ల్యాండ‌ర్‌, ప్ర‌జ్ఞ రోవ‌ర్ ఉన్నాయి. రోవ‌ర్ అక్క‌డ ఉప‌రిత‌లంపై ప‌లు అన్వేష‌ణ‌లు చేయ‌నున్న‌ది. జాబిలిపై నీట జాడ క‌నుకొనేందుకు ఇదో పెద్ద ప్ర‌యోగంగా భావిస్తున్నారు. ఇస్రో వ్య‌వ‌స్థాప‌కుడు విక్ర‌మ్ సారాభాయ్ పేరుతో చంద్ర‌యాన్ ల్యాండ‌ర్‌కు విక్ర‌మ్ పేరు పెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికా, ర‌ష్యా, చైనాలు మాత్ర‌మే .. చంద్రుడిపై రోవ‌ర్‌ను దింపాయి. ఈ ప్ర‌యోగంతో జాబిలిపై రోవ‌ర్‌ను దింపిన నాలుగ‌వ దేశంగా భార‌త్ చ‌రిత్ర సృష్టించ‌నున్న‌ది. మార్క్ త్రీ రాకెట్‌.. చంద్ర‌యాన్‌ను అనుకున్న‌ట్లే విజ‌య‌వంతంగా భూక‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టింది. చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై చంద్ర‌యాన్‌2 దిగ‌నున్న‌ది.
సెప్టెంబర్ 7న చంద్రుడిపై ల్యాండింగ్
చంద్రయాన్ 2లో ఉన్న ల్యాండ‌ర్ విక్ర‌మ్‌, రోవ‌ర్ ప్ర‌జ్ఞ‌.. ఇస్రో శాస్త్ర‌వేత్తల అంచ‌నాల ప్ర‌కారం ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 7వ తేదీన చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగ‌నున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ క‌న్నా ఒక రోజు ఆల‌స్యంగా ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నున్న‌ది. వాస్త‌వానికి జూలై 15వ తేదీన ఎగ‌రాల్సిన చంద్ర‌యాన్‌2.. సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌యోగం వారం రోజుల ఆల‌స్యం అయినా.. ల్యాండింగ్‌లో మాత్రం ఒక రోజు తేడా వ‌స్తున్న‌ది. పాత ప్లాన్ ప్ర‌కారం.. 54 రోజుల జ‌ర్నీ త‌ర్వాత చంద్ర‌యాన్‌2 .. చంద్రుడిపై దిగాల్సి ఉంది. కానీ అనుకున్న తేదీ ఆల‌స్యం కావ‌డంతో.. ఇస్రో ఇంజినీర్లు కొత్త ప్లాన్ వేశారు. అత్యంత ఖ‌రీదైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స‌మ‌యం కోల్పోవ‌డంతో.. ఇస్రో ఇంజినీర్లు కోల్పోయిన స‌మయాన్ని తిరిగి పొందేందుకు చంద్ర‌యాన్ మిష‌న్‌లో కొన్ని మార్ప‌లు చేశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 2.43 నిమిషాల‌కు షార్ కేంద్రం నుంచి చంద్ర‌యాన్2 ఎగ‌రింది. పాత ప్లాన్ ప్ర‌కారం ప్ర‌యోగం జ‌రిగిన 22వ రోజు.. చంద్ర‌యాన్ చంద్రుడి క‌క్ష్య‌లోకి వెళ్లేది. కానీ ఇప్పుడు ప్లాన్ మార‌డంతో.. చంద్రుడి క‌క్ష్య‌లోకి చంద్ర‌యాన్ వెళ్లేందుకు 30 రోజులు ప‌ట్ట‌నున్న‌ది. ప్ర‌యోగం జ‌రిగిన 43వ రోజున ల్యాండ‌ర్‌, ఆర్బిట‌ర్‌ను వేరు చేసే ప్ర‌క్రియ జ‌రుగుతుంది. 44వ రోజున డిబూస్టింగ్ చేప‌ట్ట‌నున్నారు. ఇక 48వ రోజున ల్యాండ‌ర్‌, రోవ‌ర్ .. వేరుప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉన్న మాంజిన‌ల్ సీ, సింపేలియ‌న్ ఎన్ ప్రాంతంలో ల్యాండ‌ర్ దిగే ఛాన్సుంది.