చింతమడ్కను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చింతమడ్కను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి


కలెక్టర్ వెంకట్రామరెడ్డి
సిద్ధిపేట, జూలై 06 (way2newstv.com)
సీఏం కేసీఆర్ స్వగ్రామం చింతమడకకు వచ్చే నాటికి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని వివిధ శాఖల జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట రూరల్ మండలం చింతమడక గ్రామ పంచాయతీ గ్రామంలో శనివారం ఉదయం ఆర్డీఓ జయచంద్రారెడ్డి, అన్నీ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, గ్రామ సర్పంచ్ హంసకేతన్ రెడ్డితో కలిసి గ్రామాభివృద్ధి పై సమీక్షించారు.

చింతమడ్కను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి

 సీఎం కేసీఆర్ రాక సందర్భంగా గ్రామంలో వివిధ శాఖలకు చెందిన 50 మంది జిల్లా అధికారులు, మరో 300 మంది ఉద్యోగ సిబ్బందితో గ్రామంలోని ఇంటింటా తిరిగి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాన్ని సంపూర్ణంగా చెత్త చెదారం లేకుండా చేయాలని, ఇందు కోసం గ్రామా యువత శ్రమ దానంలో పాల్గొనాలని కోరారు. గ్రామంలోని రహదారులన్నీ పచ్చని చెట్లతో కళకళలాడాలని అధికారులకు సూచిస్తూ.., అందుకు అనుగుణంగా గతంలో నాటిన చెట్ల మధ్యలో చనిపోయిన వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటి, పాదులు చేయాలని, కొత్త రోడ్లకు ఇరువైపులా పెద్ద మొక్కలు నాటాలని ఏంపీడీఓ సమ్మిరెడ్డిని ఆదేశించారు. గ్రామంలో శానిటేషనుకు సంబంధించి మురికి కాల్వల శుభ్రత విషయంలో ఏలాంటి లోటుపాట్లు జరగకుండా గ్రామమంతా పరిశుభ్రంగా ఉండేలా తగు చర్యలు చేపట్టాలని డీపీఓ సురేశ్ బాబును ఆదేశించారు. గ్రామంలోని రహదారుల్లో వచ్చిన కరెంటు స్తంభాలను త్వరగా అమర్చాలని విద్యుత్ శాఖ అధికారి పండరికి సూచించారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మురికి కాల్వల నిర్మాణం 48 గంటల్లోపు పూర్తి చేయాలని ఆర్అండ్ బీ శాఖ ఈఈ సుదర్శన్ ను ఆదేశించారు. గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని, ఎవరికైనా నష్టం జరిగితే వారికి తగిన సహకారం అందిస్తామని, లేని పక్షంలో వారే నష్టపోతారని గ్రామస్తులకు చక్కగా అవగాహన కల్పించారు. డబుల్ రూమ్స్ 24 ఇళ్లకు సంబంధించి విద్యుత్ కనెక్షను ఇవ్వాలని, అందుకు అవసరమైన మీటరుకు రూ.1200 రూపాయలు ఇస్తానని, సోమవారంలోపు రెండు పడకల గదులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని విద్యుత్ అధికారులకు సూచించారు. రెవెన్యూ సమస్యలకు సంబంధించి గ్రామంలోని 10 వార్డులకు 10 బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేయడం జరుగుతున్నదని, మరో రెండు రోజుల్లో రెవెన్యూకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదే విధంగా రేషను కార్డులు లేని వారు అధికారులకు విన్నవిస్తే గ్రామంలోని అందరికీ రేషను కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, గ్రామంలోని వివిధ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.