పదేళ్లలో కోర్సు ఎత్తేశారు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పదేళ్లలో కోర్సు ఎత్తేశారు...

హైద్రాబాద్, జూలై 11, (way2newstv.com)
ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ (బిటెక్‌) ఎంబిఎ కోర్సుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. ఈ కోర్సుకు విద్యార్థుల నుంచి అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదు. దీంతో ఈ కోర్సును జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ (జేఎన్టీయూహెచ్‌) రద్దు చేసింది. ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ ఎంబిఎ కోర్సుకు సంబంధించిన సీట్లను ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ ఎంటెక్‌ కోర్సులో విలీనం చేసింది. ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ ఎంబీఏ కోర్సు 2009లో జేఎన్టీయూహెచ్‌లో ప్రారంభమైంది. ఇంటర్మీడియెట్‌ విద్యార్హతతో ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలుంటాయి. ఈ కోర్సు ఐదేళ్ల కాల పరిమితితో ఉండేది. ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ ఎంబీఏ కోర్సులో సివిల్‌, ఈఈఈ, మెకానికల్‌, ఈసీఈ, సీఎస్‌ఈ విభాగాల్లో 12 సీట్ల చొప్పున మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
పదేళ్లలో కోర్సు ఎత్తేశారు...

ఇంజినీరింగ్‌ బీటెక్‌ నాలుగేండ్లు, ఎంబీఏ వేరుగా రెండేండ్ల చొప్పున మొత్తం ఆరేండ్లు చదవాల్సి ఉంటుంది. కానీ ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ ఎంబీఏ కోర్సు ఐదేండ్లు చదివితే ఏడాది కలిసోస్తుంది. కానీ విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి కనబరచడం లేదు. ఇంటర్మీడియెట్‌ స్థాయిలోనే ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ ఎంబీఏ కోర్సుపై సరైన అవగాహన లేకపోవడం ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. నాలుగేండ్ల బీటెక్‌ కోర్సు చదివిన తర్వాత ఉద్యోగావకాశాలతో పాటు ఉన్నత విద్యకు వెళ్లేందుకు అవకాశముంటుంది. విదేశాల్లోనూపై చదువులకు వెళ్లొచ్చు. ఈ కారణంతో ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ ఎంబీఏ కోర్సులో చేరడానికి విద్యార్థులు మొగ్గు చూపలేదు. ఈనేపధ్యంలో పదేళ్ల తర్వాత ఈ కోర్సును రద్దు చేయాలని జేఎన్టీయూహెచ్‌ నిర్ణయించింది. కాగా ఈ కోర్సులో ఉన్న 60 సీట్లను ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ ఎంటెక్‌ కోర్సులో కలిపింది. ఈ కోర్సుసైతం 2009లో 90 సీట్లతో జేఎన్టీయూహెచ్‌లో ప్రారంభమైంది. ఈ కోర్సుకు ఆదరణ ఉంది. అందుకే 90 సీట్లకు అదనంగా 60 సీట్లు కలిపి మొత్తం 150 సీట్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచింది