విజయవాడ, జూలై 26 (way2newstv.com):
ఆంధ్రప్రదేశ్ శాసనసభ లోప్రభుత్వం అసెంబ్లీలో ముఖ్యమైన నాలుగు బిల్లులను ప్రవేశపెట్టింది.. లోకాయుక్త సవరణ బిల్లు, 2019 జీతాలు, పెన్షన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు సవరణల బిల్లు, మౌలిక సదుపాయాల బిల్లు,వ్యవసాయ ఉత్పత్తులు, జీవధన మార్కెట్ల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్విస్ చాలెంజ్ పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. మౌలిక సదుపాయలు, న్యాయ పారదర్శకత సమీక్ష బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన గత ప్రభుత్వం చేసిన అవినీతిని తెలియజేస్తూ... బిల్లు ఆవష్యకతను వివరించారు. ఇది జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు అని స్పష్టం చేశారు. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
నాలుగు బిల్లులకు శానససభ ఆమోదం
రూ.100 కోట్లకు పైబడిన పనులన్నీటిపై జ్యూడిషియల్ కమిషన్ పరిశీలన ఉంటుందని తెలిపారు. స్విస్ చాలెంజ్ పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేశారని తెలిపారు. గత ఐదేళ్లలో జరిగింది ఐకానిక్ అభివృద్ధి కాదని, ఐకానిక్ అవినీతన్నారు.అవినీతిపై పోరాటంలో వైఎస్ జగన్ సర్కార్ చారిత్రాత్మక అడుగువేసింది. అక్రమాలను పూర్తి స్థాయిలో నిరోధించాడానికి జ్యూడిషియల్ కమిషన్ బిల్లును తీసుకొచ్చింది. టెండర్ విలువ రూ.100 కోట్లు దాటే పనులన్నీ ఈ కమిషన్ పరిధిలోకి రానున్నాయి. అన్ని మౌలిక సదుపాయల ప్రాజెక్టుల టెండర్లు ఈ కమిషన్ పరిధిలోకి వస్తాయి. టెండర్లు పిలవడానికి ముందే పీపీపీలు జడ్జి పరిశీలనకు వెళ్లనున్నాయి. జాయింట్ వెంచర్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ కూడా కమిషన్ పరిధిలోకి రానున్నాయి. కమిషన్ జడ్జికి నిపుణుల సలహా, సూచనలు తీసుకునే అధికారం ఉంది. జడ్జి సిఫారసులు తప్పనిసరిగా సంబంధిత శాఖ పాటించేలా ఈ బిల్లులో నిబంధనలు చేర్చారు. ఈ బిల్లు ద్వారా ఏ టెండర్ అయినా తొలుత పారదర్శకంగా ప్రజల ముందుకు వస్తుంది. వారం తర్వాత టెండర్ వివరాలు జడ్జి ముందుకు వెళ్తాయి. కమిషన్ ఏర్పాటైన తర్వాత ఏ టెండర్ అయినా 15 రోజుల్లో ఖారారయ్యేలా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు వచ్చేలా ఈ బిల్లును రూపొందించారు.
సుబాబుల్ రైతులను ఎదుర్కొంటాం
టీడీపీ ప్రభుత్వం తీరుతో సుబాబుల్ రైతులకు అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుబాబుల్ రైతుల విషయంలో అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్యాయంగా వ్యవహరించారని ఆరోపించారు. సుబాబుల్ రైతులతో సమావేశం ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనకు చెప్పారని తెలిపారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి వసంత కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా సుబాబుల్ రైతులను దేవినేని సోమరిపోతులని విమర్శలు చేశారని మండిపడ్డారు. అదేవిధంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. సుబాబుల్ రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభలో మంచి శుభవార్త చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సుబాబుల్ రైతులకు రూ.5.40 కోట్ల బకాయిలను చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు రూ. 12, 500 ఇస్తామని సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ రంగం మరింత విస్తరించనుందని సామినేని ఉదయభాను ఆశాభావం వ్యక్తం చేశారు.
టీడీపీ బాయ్ కాట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఈరోజు వాకౌట్ చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తమ నాయకుడు చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పీకర్ తమ్మినేని సీతారాంకు నమస్కారం పెట్టి బయటకు వచ్చేశారు.ప్రస్తుతం స్పీకర్ ఛాంబర్ వద్ద టీడీపీ సభ్యులు నిరసన తెలియజేస్తున్నారు. మరోవైపు టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఏపీ మార్కెటింగ్ బిల్లుతో పాటు ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందేముందు కావాలని గొడవపెట్టుకుని టీడీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రతీరోజూ టీడీపీ సభ్యులు రిపీట్ చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
Tags:
Andrapradeshnews