శ్వేతపత్రంలో ఒకలా, బడ్జెట్‌లో మరొకలా! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్వేతపత్రంలో ఒకలా, బడ్జెట్‌లో మరొకలా!

ప్రజలు దేన్ని నమ్మాలి నారా లోకేశ్‌
అమరావతి జూలై 15 (way2newstv.com)
ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పుల విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శ్వేతపత్రంలో ఒకలా, బడ్జెట్‌లో మరొకలా చెప్పారని.. రాష్ట్ర ప్రజలు దేన్ని నమ్మాలని తెదేపా ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలో భాగంగా శాసనమండలిలో ఆయన మాట్లాడారు.. ‘సీఎం జగన్‌ ప్రతి విషయంలోనూ మాట తప్పుతున్నారు.. మడమ తిప్పుతున్నారు’ అంటూ విమర్శించారు. 
శ్వేతపత్రంలో ఒకలా, బడ్జెట్‌లో మరొకలా!

వైకాపా నుంచి 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా? అని లోకేశ్‌ నిలదీశారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన సీఎం జగన్.. ప్రధాని మోదీకి పాదాభివందనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు విత్తనాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని.. వాళ్లను క్యూలైన్లలో నిల్చోబెట్టి చంపేస్తున్నారని దుయ్యబట్టారు.ఏపీ సీడ్స్ విత్తనాలు తెలంగాణలో ఇస్తున్నారని, ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని లోకేశ్‌ ప్రశ్నించారు. తెదేపా హయాంలో ఆత్మహత్య చేసుకున్న 1500 మంది రైతులకు రూ.7 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం.. వైఎస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 15 వేల మంది రైతులను మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 80 లక్షల మంది విద్యార్థులుంటే కేవలం 40 లక్షల మందికే అమ్మఒడి పథకం వర్తింపజేస్తున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులకూ కోత పెట్టారని లోకేశ్‌ విమర్శించారు. గృహ నిర్మాణానికి, సాగునీటి ప్రాజెక్టులకు, సంక్షేమ రంగానికి నిధులు తగ్గించారన్నారు.