ఎగనామం (మెదక్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎగనామం (మెదక్)

మెదక్, జూలై 9  (way2newstv.com):
పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా నేటికీ విద్యార్థులతు యూనిఫాం అందలేదు అందలేదు. కొంతమంది విద్యార్థులు గత సంవత్సరం ఇచ్చిన దుస్తులు ధరించగా, మరికొందరు గత సంవత్సరం యూనిఫాం చినిగిపోవడంతో ఇతర దుస్తులు వేసుకున్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లో అసమానతలు తొలగించడంతో పాటు క్రమశిక్షణ పెంపొందించేందుకు పంపిణీ చేస్తున్న యూనిఫాం నేటికి అందకుండా పోయాయి. పాఠశాల ప్రారంభం నాటికే దుస్తులు పంపిణీ చేయాల్సి ఉన్నా నేటికి అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.జిల్లాలో మొత్తం 904 పాఠశాలలు ఉన్నాయి. అందులో 627 ప్రాథమిక, 133 ప్రాథమికోన్నత, 144 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 81,128 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మూడేళ్ల క్రితం పాఠశాలలకు ఏకంగా కుట్టిన యూనిఫాం సరఫరా అయ్యేవి. వాటిల్లో కొలతలు తేడా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. 
ఎగనామం (మెదక్)

ఈ నేపథ్యంలో జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టెస్కో నుంచి వస్త్రాన్ని సరఫరా చేసి వాటిని కుట్టే పనిని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. ఈ ఏడాది సైతం ఏజెన్సీలకు అప్పగించగా నేటికీ అతీగతీ లేదు.పాఠశాల ప్రారంభానికి ముందే ఇవ్వాలనే ఉద్దేశంతో గత అక్టోబరులోనే యూ డైస్‌ ఆధారంగా విద్యార్థుల కొలతలు తీసుకున్నారు. దుస్తులు కుట్టడానికి ముందస్తుగా వస్త్రం సరఫరా చేస్తే, పాఠశాల ప్రారంభం నాటికే అందుబాటులోకి వచ్చేవి. ఒకటి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు రెండు జతల దుస్తులు కుట్టడానికి ఈనెల 3న, 9, 10వ తరగతి విద్యార్థులకు కుట్టడానికి ఈ నెల 10న వస్త్రం ప్రైవేటు ఏజెన్సీలకు చేరినా వాటిని కుట్టడానికి ఆలస్యం అవుతోంది. మరోవైపు కస్తూర్బా, ఆదర్శ, గురుకుల పాఠశాలల విద్యార్థులకు దుస్తులు అందజేయడానికి నేటికి వస్త్రం రాకపోవడం గమనార్హం. జిల్లాలో ఏడు మండలాల్లో కుట్టడం పూర్తయి పాఠశాలలకు చేరుకున్నట్లు అధికారులు చెపుతున్నా అవి కూడా ఒకే జత వచ్చాయని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.విద్యార్థులకు ఏటా ఇచ్చే ఏకరూప దుస్తులు ప్రతి ఏటా ఆలస్యమవుతున్నాయి. ఈ ఏడాది సైతం ఆలస్యమవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు సరిపోని, గుండీలు ఊడిన, చినిగిన గత సంవత్సరం దుస్తులు ధరించి పాఠశాలలకు వస్తున్నారు. మరికొంత మందికి పాత ఏకరూప దుస్తులు లేకపోవడంతో ఇతర రంగుల దుస్తులు వేసుకుని వస్తున్నారు. ముఖ్యంగా వసతిగృహాల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందక ఉన్న ఇబ్బంది పడుతున్నారు. ముందస్తు ప్రణాళిక కొరవడటం వల్లే దుస్తులు ఆలస్యమవుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది.