బోర్లు సరే.. మోటార్లేవీ..? (మహబూబ్ నగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బోర్లు సరే.. మోటార్లేవీ..? (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, జూలై 9 (way2newstv.com): 
జిల్లాలో కొందరు గిరిజనుల భూముల్లో భూగర్భజలశాఖ ఆధ్వర్యంలో వ్యవసాయానికి బోర్లు వేశారు. అన్నింట్లోనూ నీరు వచ్చింది. ఇంకా మోటార్లు రాకపోవడంతో వారికి ఎదురుచూపులే మిగిలాయి. గిరిజనాభివృద్ధి శాఖవారు మోటార్లు ఇస్తే వ్యవసాయం చేసుకుంటామని రైతులు ఎదురుచూస్తున్నారు.వనపర్తి కొత్త జిల్లాగా ఏర్పడ్డాక ఇక్కణ్నుంచే గిరిజనాభివృద్ధికి లబ్ధిదారుల ఎంపికతోపాటు నిధులు మంజూరు చేస్తున్నారు. 2018-19కిగాను జిల్లాకు చెందిన 13మంది ఎస్టీ రైతులను ప్రత్యేక అభివృద్ధి పథకం కింద ఎంపిక చేశారు. వీరి ఆర్థికాభివృద్ధికి ఎస్టీ ఉపప్రణాళిక నిధులను ఖర్చు చేస్తున్నారు. ఎంపిక చేసిన 13మంది రైతుల భూముల్లో బోర్లు, మోటార్లు, పైపులైన్లు వేయించి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 
బోర్లు సరే.. మోటార్లేవీ..? (మహబూబ్ నగర్)

గిరిజనాభివృద్ధి శాఖవారు జిల్లాలోని అప్పాయిపల్లి, కాశీంనగర్‌, తెల్లరాళ్లపల్లి, దొండాయిపల్లి, అన్నారం, పొలికెపాడు, అమడాలకుంటతండా, కేశంపేట, నెల్విడి, కంబాలాపురంలో ఒక్కొక్కరు చొప్పున, పెద్దమందడి మండలం గట్లఖానాపూరుకు చెందిన నలుగురిని ఎస్టీ ఉపప్రణాళిక కింద ఎంపిక చేశారు. ఎంపిక చేసిన గిరిజన రైతుల వ్యవసాయ భూముల్లో జిల్లా భూగర్భజలశాఖవారు 100 నుంచి 110 మీటర్ల లోతువరకు బోర్లు వేశారు. అన్ని బోర్లలోనూ నీరువచ్చింది. ఈమేరకు భూగర్భజలశాఖవారు గిరిజనాభివృద్ధిశాఖకు రైతుల వివరాలతో లేఖ రాశారు. బోర్లలోని నీటి ఆధారంగా ఎంత సామర్థ్యం మోటార్లు అవసరమవుతాయో భూగర్భజలశాఖ నివేదికను గిరిజనాభివృద్ధిశాఖకు పంపించింది. 8 మంది రైతులకు 5హెచ్‌పీ, నలుగురికి 3హెచ్‌పీ, ఒకరికి 2.5హెచ్‌పీ మోటారు అవసరమవుతాయని ఆ లేఖలో తెలిపారు. జిల్లా గిరిజనాభివృద్ధిశాఖవారు ఎంపిక చేసిన రైతుల భూముల్లో బోర్లు వేయడానికి ఈ ఏడాది జనవరి మొదటి వారంలో కలెక్టరు అనుమతులిచ్చారు. జనవరి చివరి వారంలో హైదరాబాదులోని భూగర్భజలశాఖ డైరెక్టరు నుంచి సాంకేతిక అనుమతులొచ్చాయి. దీంతో 13మంది రైతుల వ్యవసాయ భూముల్లో ఫిబ్రవరిలో జిల్లా భూగర్భజల శాఖవారు బోర్లు వేశారు.జిల్లా గిరిజనాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఎంపికై వ్యవసాయ భూముల్లో బోర్లు వేయించుకున్న రైతులు ఇప్పుడు మోటార్ల మంజూరుకు ఎదురుచూస్తున్నారు. గిరివికాసం కింద ఈ రైతులకు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షలు మంజూరు చేయాల్సి ఉంది.