మాటలకే పరమితం (మహబూబ్ నగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మాటలకే పరమితం (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, జూలై 20 (way2newstv.com):
రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మను ఘనంగా నిర్వహించడం, ప్రజలకు ఆహ్లాదం పంచడంతోపాటు చిన్ననీటి వనరులను పటిష్ఠం చేయడానికిగాను ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటి నిర్మాణానికి ప్రభుత్వం నిధులనూ మంజూరు చేసింది. అయినా.. ఉమ్మడి జిల్లాలో వీటి నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం పెండింగు నిధులను మంజూరు చేయడంలేదన్న ఉద్దేశంతో గుత్తేదారులు చేతులెత్తేశారు. దీంతో నియోజకవర్గాల ప్రజలకు ఆహ్లాదం ఆవిరవుతుండగా.. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన నిర్మాణాలు పడకేశాయి.ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక్కో మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. 
మాటలకే పరమితం (మహబూబ్ నగర్)

ఈ నిధులతో మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణాల్లో భాగంగా బతుకమ్మ ఘాట్లను నిర్మిస్తూ చెరువు కట్టలను పటిష్ఠం చేయాలి. ప్రజలకు ఆహ్లాదం పంచడానికి కట్టల వెంబడి ఎక్కువ సంఖ్యలో మొక్కలు పెంచాలి. ఈ పనులను చేపట్టి పూర్తిచేసే బాధ్యతలను ప్రభుత్వం చిన్న నీటి పారుదల శాఖ అధికారులకు అప్పగించింది. అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో రెండేళ్ల క్రితం 12 మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. అయినా.. వాటిలో ఇప్పటి వరకు ఒక్క పనీ పూర్తవలేదు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాల్లో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్‌ల పనులు మాత్రమే చివరి దశకు చేరుకున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వివిధ నియోజకవర్గాల్లో మిగిలిన 10 మినీ ట్యాంక్‌బండ్‌ల పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంలా తయారయ్యాయి. కొన్ని మినీ ట్యాంక్‌బండ్‌లను పూర్తిచేయడానికి నిర్ణీత గడువు ముగిసినా.. ఇప్పటి వరకు పూర్తవలేదంటే వీటి నిర్మాణంలో గుత్తేదారులు, అధికారులు ఏ మేరకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతోనే కాంట్రాక్టర్లు వీటి నిర్మాణ విషయంలో అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనుల ప్రారంభ సమయంలో ఉత్సాహం చూపిన గుత్తేదారులు ఆ తరవాత బిల్లులు మంజూరవడం లేదన్న కారణంతో పట్టించుకోవడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. మరికొంత భాగం పనులు పూర్తయితే ఈ రెండు మినీ ట్యాంక్‌బండ్‌ అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం బిల్లులను చెల్లించడం లేదన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు మిగిలిన పనులను పూర్తి చేయకుండా వదిలేశారు. ప్రధానంగా బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికే ప్రభుత్వం మినీ ట్యాంక్‌బండ్‌లను నిర్మించాలని ప్రతిపాదించింది. మరో మూడు నెలల్లో బతుకమ్మ పండుగ జరగనున్నా.. ఇంతవరకు పనులు కొలిక్కి రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.దేవరకద్రలో మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనులకు 2017, మే 16న అప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావు శిలాఫలకం వేశారు. కాంట్రాక్టర్ కట్ట పనులు మాత్రమే పూర్తి చేశారు. తరవాత పనులను నిలిపేశారు. రెండేళ్ల క్రితం చేపట్టిన ఈ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.  అచ్చంపేటలో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్‌ పనులు అసంపూర్తిగా మారాయి. బతుకమ్మ ఘాట్‌, కట్ట పనులు పూర్తవలేదు. పనుల సమయంలో కాంట్రాక్టర్ కుదుర్చుకున్న ఒప్పంద గడువూ ముగిసింది.  కొల్లాపూర్‌లో మినీ ట్యాంక్‌బండ్‌ పనులను ఇటీవలనే చేపట్టారు. పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇప్పట్లో మినీ ట్యాంక్‌బండ్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. వనపర్తిలో మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనులను మూడు నెలల కిందట నిలిపేశారు. ఇటీవలే పనులను మళ్లీ మొదలుపెట్టారు. అయినా.. ఇప్పట్లో పనులు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.  మక్తల్‌లో చేపట్టిన పనులు ముందుకు సాగడం లేదు. పనులు అసంపూర్తిగా మారాయి. బతుకమ్మ నాటికి మినీ ట్యాంక్‌బండ్‌ అందుబాటులోకి రావడం గగనమేనని స్థానికులు పేర్కొంటున్నారు.పెరుగుతున్న పెండింగ్‌ బిల్లులు  నాగర్‌కర్నూల్‌ మినీ ట్యాంక్‌బండ్‌కు సంబంధించిన బిల్లులు సుమారు 10 నెలలుగా పెండింగులో ఉన్నాయి. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.16.33 కోట్లను కేటాయించింది. పనులు 90 శాతానికిపైగా పూర్తయ్యాయి. పెండింగు బిల్లులను రూ.4 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. వనపర్తి మినీ ట్యాంక్‌బండ్‌కు రూ.6.58 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ.2.50 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రూ. కోటి పెండింగు బిల్లులు రావాల్సి ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్‌ల పెండింగు బిల్లులను చెల్లించకపోవడంతోనే కాంట్రాక్టర్లు పనులు చెల్లించకుండా నిలిపేసినట్లు తెలుస్తోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి అసంపూర్తి పనులను పూర్తి చేసేలా గుత్తేదారులను పురమాయించాలని ప్రజలు కోరుతున్నారు.