ఇసుక తుఫాన్ (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇసుక తుఫాన్ (కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, జూలై 27 (way2newstv.com): 
జిల్లాలో అనూహ్యంగా ఇసుక డిమాండ్‌ పెరిగింది. ఇసుక రేవుల వద్ద ట్రాక్టర్లు పెద్దఎత్తున బారులు తీరడంతో నియంత్రించడం అధికారులకు సమస్యగా మారింది. ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోవడం.. సరఫరా లేకపోవడంతో రేవుల వద్దకు వచ్చే వాహనాలు పెరిగాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దేందుకు కొంతమంది వ్యాపారులు ఎత్తుగడ వేస్తున్నారు. ఇసుక నిలువలను భారీగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇసుకను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. అనుమతుల పేరుతో కొంత సరళీకృత విధానం ఉండటంతో ఇసుక ఇతర జిల్లాలకు రవాణా అవుతోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కృష్ణా జిల్లా నుంచి రవాణా అవుతోంది. దీంతో అక్రమ రవాణా భారీగా పెరిగింది. జిల్లాలో ఇసుక ధరలు అమాంతం పెరిగాయి. 
ఇసుక తుఫాన్ (కృష్ణాజిల్లా)

ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగానే అందిస్తున్నా ట్రక్కు యజమానులు వాటి ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ట్రక్కు ఇసుక రూ.3వేల నుంచి రూ.10వేలకు ఒక్కసారిగా పెరిగిందని స్థిరాస్తి వ్యాపారులు, భవన నిర్మాణదారులు వాపోతున్నారు. సెప్టెంబరు నాటికి కొత్త విధానం రానుంది. అప్పటి వరకు అందినకాడికి తవ్వేందుకు వ్యాపారులు సన్నద్ధమయ్యారు. వారికి స్థానిక నాయకులు సహకారం అందిస్తున్నారు. ఇసుక రవాణాపై జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించినా క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది.కృష్ణా జిల్లాలో లభించే ఇసుకకు సహజంగానే డిమాండ్‌ ఎక్కువ. ఇక్కడ నాణ్యమైన ఇసుక లభిస్తుందని నిర్మాణదారుల నమ్మకం. ఎక్కువగా ప్రకాశం బ్యారేజీ పైభాగాన, దిగువను ఇసుక రీచ్‌లు ఉండేవి. డ్రెడ్జింగ్‌ ద్వారా కూడా ఇసుకను తోడేవారు. ప్రధానంగా ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలో సూరాయపాలెం, గుంటుపల్లి, గొల్లపూడి, పవిత్ర సంగమం ప్రాంతంలో ఇసుకను తోడేవారు. పడవల్లో నదిలోకి వెళ్లి మోటార్ల ద్వారా తరలించేవారు. దీనికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తప్పనిసరిగా నిలుపుదల చేయాల్సి వచ్చింది. ఈ ఇసుక రేవులను ఇటీవల కొంతమంది నేతలు తమ చేతుల్లో పెట్టుకొని ఇసుక విక్రయాలను భారీగా జరిపారు. ఈ ప్రాంతం నుంచి 20 టన్నులు, 30 టన్నుల లారీల్లో హైదరాబాద్‌కు తరలిపోయేవి. అక్కడ ఇసుక రూ.40వేల నుంచి రూ.60వేల వరకు పలికేది. దీన్ని కొంత మంది నేతలు వ్యాపారంగా మార్చుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ రేవులపై ఆధిపత్యం కొనసాగింది. నేతల మధ్య పోరుతో అధికారుల దృష్టికి వెళ్లడంతో సబ్‌కలెక్టర్‌ సందర్శించి రేవులను నిలుపుదల చేశారు. మరోవైపు నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ కూడా తీర్పు ఇవ్వడంతో రేవులను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆరు రేవులు కొనసాగిస్తున్నారు. బ్యారేజీ దిగువ భాగంలో ఘంటసాల మండలంలో శ్రీకాకుళం, తోట్లవల్లూరు మండలంలో నార్త్‌వల్లూరు, కంచికచర్ల మండలంలో చెవిటికల్లు, నందిగామ మండలంలో కంచల, పెనుగంచిప్రోలు మండలం పరిధిలో శనగపాడు, చందర్లపాడు మండలంలో కాసరబాద రేవుల్లో తవ్వకాలకు అనుమతించారు. ఆయా మండల తహసీల్దార్లకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. దీనికి నిబంధనలు పెట్టారు. ఇంటి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తీసుకెళ్లవచ్చని చెబుతున్నారు. అనుమతులు చూపాల్సి ఉంది. కానీ వందల సంఖ్యలో ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. అనుమతుల విషయంలో అంతగా పట్టించుకోవడం లేదు. కానీ లోడింగ్‌ పేరుతో రూ.300, బాట ఛార్జీలు రూ.30 వసూలు చేయాల్సి ఉండగా రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం విరుద్ధంగా ఉంది. కొంతమంది వ్యాపారులు ట్రాక్టర్లను మోహరించి ఇసుక నిలువలు పెంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.చెవిటికల్లు రేవు నుంచి తవ్వేందుకు గతంలో స్థానికులు వ్యతిరేకించారు. తమ గ్రామ అవసరాలకు మాత్రమే వాడతామని చెప్పారు. కానీ ప్రస్తుతం అక్కడి నుంచి కూడా భారీగా రవాణా అవుతోంది. శనగపాడు, కాసరబాద రేవుల నుంచి కూడా అదే విధంగా ఉంది. సెప్టెంబరు 5 నాటికి కొత్త విధానం వచ్చే అవకాశం ఉంది. కొత్త విధానంలో ఇసుక రేవులను వేలం ద్వారా అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడే భారీగా నిలువ చేయాలని కొంతమంది ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కృత్రిమ కొరతతో ఇప్పటికే భారీగా ధరలు పెరిగాయి.