ఆక్వా అవస్థలు (ఏలూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆక్వా అవస్థలు (ఏలూరు)

ఏలూరు, జూలై 27 (way2newstv.com): 
ఓ వైపు ఉప్పు నీరు.. మరోవైపు తృణ ధాన్యాల కొరత.. ఇంకోవైపు గిట్టుబాటు ధర లేమి.. నీటి ఎద్ద్డడి, వ్యాధులతో ఆక్వా రైతులు అవస్థలు పడుతున్నారు. వీటికి తోడు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు మేతల ధర పెరుగుదల వారిని కుంగదీస్తోంది. పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గి అప్పులపాలు కావడం తప్ప వేరే మార్గం లేదంటూ వారు వాపోతున్నారు. చేపలు, రొయ్యలు అనే వ్యత్యాసం లేకుండా పెట్టుబడి భారంతో చిన్న, సన్నకారు రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లాలో మొత్తం 67,519 హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతోంది. ఇందులో 45 వేల హెక్టార్లలో చేపలు, 22,519 హెక్టార్లలో రొయ్యలు సాగు చేస్తున్నారు. చేపల సాగుకు 22,250 టన్నులు, రొయ్యలకు 2,815 టన్నుల వరకు వివిధ రకాల మేతలను వాడుతున్నారు. గతంతో పోలిస్తే కిలో డీవోబీ రూ.8, వేరుసెనగ చెక్క రూ.4 వరకు ధర పెరిగింది. డీవోబీ ధర ఆకాశాన్నంటింది. 
 ఆక్వా అవస్థలు (ఏలూరు)

టన్ను ధర రూ.20 వేల వరకు ఉంది. ఇది రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. పెరిగిన ధరలకు తగ్గట్టు దిగుబడి, ధర ఉండటం లేదు. గతేడాదికి ఇప్పటికి మేతల ధరలో వచ్చినంత తేడా చేపల ధరల్లో రావడం లేదు. టన్ను మేత ధర రూ.20 వేలు ఉంటే.. చేపల ధర రూ.లక్ష 10 వేలుగా ఉంది. మేతల ధరలు పెరడంతో ఇదే అదనుగా కొందరు వ్యాపారులు కల్తీచేస్తున్నారు. చేప పిల్లలను రక్షించుకోవడానికి ధరలు పెరిగినా రైతులు కొనుగోలు చేస్తున్నారు. కల్తీ మేతలు వేసి నష్టాల పాలవుతున్నారు. వేరుసెనగ చెక్కలో చింతపిక్కల పొడి, ఇసుక, వేరుసెనగ తొక్కల పొడిని కలుపుతున్నారు.చేపలు, రొయ్యల సాగులో పెట్టుబడి వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. సొంత చెరువులు సాగు చేసే రైతులే నష్టాలబారిన పడుతుంటే.. ఇక కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. సొంత రైతులకు కౌలు కట్టాలి. పంటకు పెట్టుబడి పెట్టాలి. ఇవన్నీ చేయడానికి మళ్లీ అప్పు చేయాలి. దానిపై వడ్డీ చెల్లించాలి. ఇన్ని చేసినా పంట చేతికొస్తుందా అంటే చెప్పలేం. మేతల ధరలు పెరగడంతో దిక్కుతోచని స్థితిలో వారున్నారు. ఇదే అదనుగా మేత దుకాణాల వారు డబ్బులు తీసుకోకుండా మేత ఇచ్చేస్తున్నారు. చేపలు, రొయ్యలు పట్టిన తర్వాత అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ముందు డబ్బులు తీసుకోకుండా మేతలు ఇస్తున్నారని వారు మాట్లాడలేక పోతున్నారు. ఈ విధానంలో మేతల దుకాణాల వారు బాగుపడుతున్నారు.తృణధాన్యాలకు అధిక డిమాండ్‌ ఉండటమే మేతల ధర పెరగడానికి ప్రధాన కారణం. డీవోబీ ధర గగన కుసుమమే అవుతోంది. సాధారణంగా జులై నుంచి నవంబరు వరకూ ధరలు పెరుగుతాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను ప్రభావితం చేస్తున్నారు. కృత్రిమ డిమాండ్‌ సృష్టించి అమాంతం రేట్లు పెంచి అమ్ముతున్నారు. మేతలు తగ్గిస్తే దిగుబడిపై ప్రభావం చూపుతుందని ధరలు పెరిగినా రైతులు అప్పులు తెచ్చి కొనుగోలు చేస్తున్నారు.