రైతు బజార్లలలో దళారుల దందా. . - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతు బజార్లలలో దళారుల దందా. .

విశాఖపట్టణం, జూలై 18, (way2newstv.com)
ప్రజలకు, మార్కెట్‌కు సరుకును తెచ్చే రైతులకు మధ్య మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడమే రైతు బజార్ల లక్ష్యం. పళ్లు, కూరగాయలు, ఆకుకూరల ధరలను నిర్ణయించేది కూడా రైతుల కమిటీయే. 1999లో రాష్ట్రంలో స్థాపించబడిన రైతు బజార్లు వినియోగదారుల సేవలో ఎంతగానో నిమగమై సరుకులను అందించడంలో సఫలీకృతమవుతూ వస్తున్నాయి. అయితే అంచెలంచెలుగా కొంతమంది దళారుల ప్రాబల్యం కూడా రైతు బజార్లపై పడింది. అధికారులపై వీరి ఒత్తిడి వల్ల ధరల నిర్ణయంలో దగాకు ఆస్కారమేర్పడి అంతిమంగా రైతులు రోడ్డుపైన పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ప్రయివేటు మార్కెట్‌ శక్తుల ప్రభావం కూడా రైతు బజార్లపై పడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
రైతు బజార్లలలో దళారుల దందా. . 

అమ్ముడు కాని సరుకును ఇంటికి తీసుకెళ్లలేక, అక్కడే ఉంచితే పరిశుభ్రత దెబ్బతిని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటూ కొంతమంది రైతులు ఆవేదన చెందారు. అధిక మొత్తంలో కూరగాయలు అమ్మకూడదనే నిబంధన రైతులకు శాపంగా మారింది.. కిలో లెక్కన బెండకాయలు, వంకాయలు రైతు బజారు రేటు ప్రకారం రూ.18 ఉన్నప్పటికీ రూ.10కి కూడా వినియోగదారులు తీసుకెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని, బాగా ధర తగ్గిపోయిందని రైతులు ఆవేదన చెందారు. బరబాటికి రూ.16 ధర నిర్ణయించినా రూ.8కు కూడా తీసుకెళ్లడం లేదని చెబుతున్నారు. అదే అధిక మొత్తంలో హోటళ్లు, హాస్టళ్లు, అనాథ ఆశ్రమాలకు, ప్రభుత్వ శాఖల క్యాంటీన్లకు వేస్తే ఈ సరుకంతా ఒక్క ఉదుటన అమ్ముడైపోతుంది. కానీ తాజాగా రైతు బజార్లలో 2 లేదా 3 కేజీల కంటే అధికంగా బయటకు తీసుకెళ్లకూడదని, మూటలు కట్టుకుని కిలోలు లెక్కన బయటకు వెళ్లకూడదని నిబంధనలు పెట్టేశారు. బయటకు అధిక మొత్తంగా సరుకు వెళ్లకుండా ఎస్టేట్‌ అధికారులు, సెక్యూరిటీ గేట్ల వద్దనే కాపలా కాస్తూ అమ్ముడు పోనివ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వినియోగదారులు కొనక బయట అమ్ముకోలేక తమ గోడు పట్టించుకునే నాథుడు లేడంటూ కొద్దిమంది రైతులు ఆవేదన చెందడం కనిపించింది. రైతులకు ధర లేకుండా చూస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జూన్‌ నుంచి ఆగస్టు వరకూ వర్షాకాలం అయినందున బరబాటి, వంగ, బెండ, బీర, కాకర, దోసకాయలు వంటి స్థానిక మార్కెట్‌ కూరగాయలు విపరీతంగా అన్ని రైతు బజార్లలోకి వచ్చి పడుతున్నాయి. విశాఖలో సుమారు 12 రైతు బజార్లు ఉన్నాయి. మధురవాడ, ఎంవిపి, చినవాల్తేరు, సీతమ్మధార, నర్సింహనగర్‌, కంచరపాలెం, మర్రిపాలెం (ఆర్‌అండ్‌బి), గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక, మునగపాకలో రైతు బజార్లలో ఇవి దర్శనమిస్తాయి. జిల్లాలోని కశింకోట, దేవరాపల్లి, కె.కోటపాడు, రావికమతం, ఆనందపురం, సబ్బవరం, నక్కపల్లి నుంచి రైతులు తమ పొలాల్లో స్వయంగా పండించినవి విశాఖ రైతు బజార్లకు తీసుకు రావడం ఆనవాయితీగా ఉంది. రైతు బజార్లు గాకుండా విశాఖనగరంలోని జ్ఞానాపురంలో హోల్‌సేల్‌ మార్కెట్‌ కూడా ఉంది. ఎపి మార్కెటింగ్‌ అధికారులు, ఎస్టేట్‌ అధికారి రోజుకొకరు ఇక్కడ నుంచే రైతు బజార్లలో సరుకుల ధరలు నిర్ణయించడం చేస్తారు. మార్కెట్‌లో వ్యాపారుల ప్రయోజనాలకంటే రైతుల ఆలోచనలకే అధికారులు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా ఇది ఒక్కోసారి బ్యాలన్స్‌ తప్పి రైతు బజార్లలో ధరలను ప్రభావితం చేసి.. సరుకులు మిగిలిపోయేలా చేస్తుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. చివరకు మిగిలిపోయిన కూరగాయలను పశువులకు వేసుకోవడం మినహా రైతులకు చేసేదేమీ ఉండడం లేదని తెలుస్తోంది. ఉల్లి, బంగాళా దుంపలు, టమోటా, క్యారెట్‌, బీట్‌రూట్‌ల ధరలు రైతు బజార్లలో షావుకార్ల ఇష్టానుసారం మారిపోతుంటాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక మార్కెట్‌లో జూన్‌ నుంచి ఆగస్టు వరకూ రైతుల అభీష్టం మేరకు అమ్ముకునేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ కూడా రైతుల నుంచి వినిపిస్తోంది. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ మార్కెట్‌ సీజన్‌ టమోటాకు ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఒక్కో మార్కెట్‌కు 8 టన్నులు సరుకు వస్తుంది. అయితే దీన్ని బల్క్‌గా కూడా అమ్ముకుంటేగానీ రైతుకు సరైన గిట్టుబాటు ధర రాదని పలువురు చెబుతున్నారు. అధిక కిలోల్లో కూరగాయలు విక్రయించకూడదన్న నిబంధన ఉంది. బల్క్‌ సరుకును బయటకు వదిలితే వ్యాపార దృక్పథం బలపడుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నాం. సరుకును బయటకు పంపితే వినియోగదారుల మధ్య గొడవలు కూడా వస్తాయి. మాకు ఆ అనుభవాలు కూడా ఉన్నాయి