బీమా ఎట్లా..? (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బీమా ఎట్లా..? (కరీంనగర్)

కరీంనగర్, జూలై 26 (way2newstv.com): 
పత్తి రైతులకు ఆదిలోనే హంసపాదు అనే పరిస్థితి ఎదురవుతోంది. ఆశల సాగుకు సిద్ధమైన అన్నదాతల్ని ఖరీఫ్‌లోని కరవుఛాయలు వెక్కిరిస్తున్నాయి. ఊరించి ఉసూరుమనిపిస్తున్న మేఘాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండటం.. సాగులో అవరోధాలు ఎదురైతే అండగా ఉండాల్సిన బీమా గడువు ఇంతలోనే ముగియడంతో కృషీవరులకు కష్టకాలమే ఎదురొస్తోంది. తెల్ల బంగారంగా భావించే పత్తి సాగును విస్తృతంగా సాగుచేసే కర్షకులకు కరీంనగర్‌ జిల్లాలో కష్టకాలమే ముందుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారమంతా దేవుడిపైనే వేసి..వేల రూపాయల పెట్టుబడుల్ని పెట్టిన అన్నదాత పరిస్థితి ఈ ఖరీఫ్‌ ఆరంభంలోనే అగమ్య గోచరంగానే మారుతోంది. వేలాది రైతు కుటుంబాలకు ఆధార పంటగా మారిన పత్తిని ఈ సారి జిల్లాలో గణనీయంగానే సాగు చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నా.. అన్నదాతలు మాత్రం అధైర్యపడక సాగు సమరంలో ముందుకు సాగుతున్నారు. 
బీమా ఎట్లా..? (కరీంనగర్)

వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకుంటూనే ఈ సారి జిల్లా వ్యాప్తంగా 42,856 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. ఈ ఏడాది సాధారణ విస్తీర్ణమైన 50,968 ఎకరాలకుగానూ 84 శాతం మేర పంటల్ని వేశారు. గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో 42,918 ఎకరాల్లో  రైతులు ఆయా మండలాల్లో ఇదే పంటను వేశారు. కాగా ప్రతి కూల పరిస్థితుల్ని ముందే గుర్తించిన రైతులు పంట బీమా విషయంలో నిర్లక్ష్యాన్ని చూపించారు. ఓ వైపు అధికారులు సక్రమంగా అవగాహన కల్పించకపోవడంతోపాటు గతంలోనూ ఈ పరిహారం సక్రమంగా అందలేదనే సాకుతో ఈ సారి బీమా విషయంలో పత్తి రైతులు అనాసక్తితో వెనుకంజ వేశారు. జిల్లాలో సుమారుగా 50 వేలకుపైగా అన్నదాతలు ఉండగా ఇందులో కేవలం 654మంది మాత్రమే ఈ బీమా ప్రీమియాన్ని కట్టేందుకు ఉత్సాహాన్ని చూపించారు. వీరితోపాటు పంట రుణాల్ని తీసుకున్న రైతుల నుంచి ఆయా బ్యాంకుల ద్వారా ఈ ప్రీమియం చెల్లించుకునే వెసులుబాటు ఉండటంతో ఈ సంఖ్య కొంత పెరిగే వీలుంది. కాగా నేరుగా ప్రీమియం చెల్లించే విషయంలో చాలా మంది అనాసక్తిని చూపించారనే చెప్పాలి. 2018 ఖరీఫ్‌ సీజన్‌లో కూడా కేవలం 682 మంది రైతులు రూ.28.02లక్షల్ని ఇందుకోసం చెల్లించారు. 2017 ఖరీఫ్‌లోనూ 970మంది మాత్రమే ఉత్సాహాన్ని చూపించారు. అప్పట్లో ఈ రైతులు రూ.37.52లక్షలను బీమా పథకం కోసం ప్రీమియంగా వెచ్చించారు. ఎకరం పంట నష్టపోతే రూ.35 వేలు పరిహారంగా అందే వీలుంది. ప్రీమియం మొత్తం రూ.7,787 కాగా రూ.6,038లను ప్రభుత్వం భరిస్తుంది. ఇక రైతు మాత్రం తన వాటాగా రూ. 1750 చెల్లించాలి. ఈ నెల 15వ తేదీ గడువు ముగియడంతో గత రెండు ఖరీఫ్‌ సీజన్ల కన్నా తక్కువ మంది ఆసక్తిని చూపించారు. వరుణుడు కరుణించక, వేసిన విత్తనాలు మొలకెత్తక.. తీరా పంట వచ్చే సమయానికి ధర చేతికి రాక.. ఇలా పత్తి రైతుకు ఎప్పుడు విపత్తి ఏదో రకంగా ఎదురవుతూనే ఉంది. వర్షాధార పంట అయిన ఈ పత్తికి అటు ప్రకృతి ప్రకోపంతోపాటు కరవు రక్కసి పలురకాలుగా ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలకు అనుకూలంగా ఉండటంలేదు. ఇప్పటికే వర్షాలు విస్తృతంగా కురిసి, వేసిన విత్తు మొలకెత్తి పంట ఒక రూపునకు రావాల్సి ఉన్నా.. ఆ పరిస్థితి చాలా మండలాల్లో అగుపించడం లేదు. పొలాల చెంతన ఉన్న జలాశయాలు వట్టిపోయి దిగాలును పెంచుతున్నాయి. వేసిన విత్తనాల్ని కాపాడుకునేందుకు రైతులు అష్టకషాలు పడుతున్నారు. తప్పనిసరై అందుబాటులో ఉన్న బోర్లు, బావుల నీటితో తడుల్ని అందిస్తూ మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇలా ఇక్కట్లమయమయ్యే రైతుకు కనీసం బీమా కూడా ఈ ఏడాది అండగా నిలబడలేకపోతోంది. ఇప్పటికే ఈనెల 15వ తేదీతో ముగిసిన గడువుతేదీని పెంచాలని పలువురు అన్నదాతలు కోరుతున్నారు. ఇదే సమయంలో సక్రమంగా పరిహారం అందించేలా చూస్తే ప్రీమియం చెల్లింపు విషయంలో మరింత ఆసక్తిని చూపిస్తామనే మాటల్ని గతంలో ప్రీమియం చెల్లించి రిక్తహస్తాన్ని అందుకున్న బాధితులు వినిపిస్తున్నారు. కనీసం ఈ సారైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కర్షకులకు సాగు బాగుండేలా భరోసాను.. బీమా విషయంలో తోడ్పాటును అందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.