పార్టీలో బలోపేతం జనసేనాని దృష్టి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పార్టీలో బలోపేతం జనసేనాని దృష్టి


గుంటూరు, జూలై 4, (way2newstv.com)
సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాన్ని దృష్టిలో ఉంచుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలో అంతర్గతంగా చర్చించుకున్న పవన్‌కళ్యాణ్ పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణాలు, పార్టీకి వెన్నంటి ఉన్న వర్గాలు, సానుభూతితో ఉన్న వర్గాలతో పాటు ఎన్నికల్లో పార్టీకి యువత అండ వంటి అంశాలపై అభ్యర్థుల అభిప్రాయాలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. పలు దఫాలుగా 13 జిల్లాల్లోనూ శాసనసభకు, పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థులతో భేటీలు నిర్వహించి వారికి ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను సేకరించారు. ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావితం చేసిన అంశాలు, క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతానికి మునుముందు ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే అంశంపై పార్టీలోని సీనియర్ నేతలు, ముఖ్యనేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. 

పార్టీలో  బలోపేతం జనసేనాని దృష్టి

ఇప్పటికే పార్టీకి ఉన్న అన్ని కమిటీలను రద్దు చేసిన పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. అమెరికా నుండి తిరిగి వచ్చిన అనంతరం విజయవాడ రానున్న పవన్‌కళ్యాణ్ పార్టీ కమిటీల ఏర్పాటుపై సమావేశాలను నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నేతలు, నాయకుల అభిప్రాయాలను క్రోడీకరించి రాష్ట్ర కమిటీలను ప్రకటించనున్నారు.జనసేన పార్టీకి సంబంధించిన అతి ముఖ్యమైన కమిటీలను ఏర్పాటు చేస్తున్న పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చిరంజీవి అధ్యర్యంలో ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీలో కీలక బాధ్యతలను నాగబాబు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో నేరుగా సత్సంబంధాలను కొనసాగించిన నాగబాబు నాడు పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు కీలకంగా వ్యవహరించారు. అప్పటి ఆయన అనుభవాలను ఇప్పడు జనసేనకు వినియోగించుకునే ఆలోచనలతో నాగబాబుకు పార్టీ కో ఆర్డినేటర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి అత్యంత విధేయంగా, అభిమానంగా, సానుభూతితో ఉంటే వర్గాలను పార్టీకి మరింత దగ్గర చేయడంతో పాటు నేతలకు, ముఖ్యనేతలకు, అధినేతకు సంధాన కర్తగా వ్యవహరించే విధంగా నాగబాబుకు పార్టీలో కీలకమైన కో ఆర్డినేటర్ పదవిని అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.