సంక్షోభంలో కర్ణాటక జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వం ! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సంక్షోభంలో కర్ణాటక జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వం !


తాజాగా రాజీనామా బాటపట్టిన మరో 11 మంది శాసనసభ సభ్యులు

బెంగళూరు జూలై 6 (way2newstv.com):
ఇటీవల కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాతో రసకందాయంలో పడిన కర్ణాటక రాజకీయంలో తాజాగా మరో 11 మంది శాసనసభ సభ్యులూ రాజీనామా బాటపట్టారు. ఈపరిణామాలతో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు బీసీ పాటిల్‌, మునిరత్న, ప్రసాద గౌడ పాటిల్‌, శివరామ, రామలింగా రెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్‌, రమేశ్‌ జక్కహళ్లి తదితరులు తమ రాజీనామా పత్రాలతో స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యదర్శికి అందజేశారు. అనంతరం గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాలను సమర్పించేందుకు వెళ్తున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న స్పీకర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. 8 మంది కాంగ్రెస్‌, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను పునఃపరిశీలన చేసి.. సోమవారం నిర్ణయం చెబుతానని ఆయన స్పష్టంచేశారు. అయితే, వీరతా ఏ కారణంతో  రాజీనామా నిర్ణయం తీసుకున్నారనే దానిపై మాత్రం స్పష్టత రావడంలేదు.
సంక్షోభంలో కర్ణాటక జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వం !

ఈ వ్యవహారంపై మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల రాజీనామా వెనుక ఉద్దేశాలంటో తనకు తెలియదని అన్నారు. రాజీనామాలు ఇంకా స్పీకర్‌ పరిశీలనలో ఉన్నాయి గనక ఆయన నిర్ణయం తర్వాత తాను స్పందిస్తానన్నారు. మరోవైపు, కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా ప్రసిద్ధిగాంచిన డీకే శివకుమార్‌ తప్ప కాంగ్రెస్‌ నేతలెవరూ దీనిపై స్పందించడంలేదు.  కర్ణాటకలో మొత్తం 225 అసెంబ్లీ స్థానాలున్నాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో భాజపా 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 80, జేడీఎస్‌ 37 సీట్లలో గెలిచింది. కన్నడనాట ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 113. ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ జట్టు కట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చాయి. ఇందుకు గవర్నర్‌ కూడా ఆమోదించడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఆనంద్‌ సింగ్‌ రాజీనామాతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ బలం 116కు పడిపోయింది. తాజాగా మరో 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను కూడా స్పీకర్‌ ఆమోదిస్తే కూటమి బలం 105కి పడిపోతుంది. దీంతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది.  మరోవైపు, కర్ణాటకలో జరుగుతున్న ఈ పరిణామాలపై భాజపా వేచిచూసే ధోరణిలో ఉన్నట్టు సమాచారం. వీరి రాజీనామాలకు వ్యక్తిగతమైన అంశాలు కాకుండా  పొత్తులు వద్దనే ఉద్దేశమే కనబడుతున్నట్టు తెలుస్తోంది. మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఏ పార్టీకీ మెజారిటీ లేనప్పుడు మధ్యంతర ఎన్నికలు అనివార్యం. అలా కాకుండా గవర్నర్‌ బలనిరూపణ కోసం ఒకవేళ భాజపాకు అవకాశం ఇస్తే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలుంటుంది. అప్పటికి సభలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య ఆధారంగా బలనిరూపణ జరిగి భాజపా గట్టెక్కితే ఆ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కన్నడ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

ఉపముఖ్యమంత్రి అత్యవసర భేటీ
తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్‌ అత్యవసర భేటీ ఏర్పాటుచేశారు. బెంగళూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో ఈ సాయంత్రం వీరు భేటీ కానున్నారు. కాగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. తాజా పరిస్థితులు తెలుసుకున్న ఆయన ఈ రాత్రికే అమెరికా నుంచి బయల్దేరుతున్నట్లు సమాచారం.దేవెగౌడ అప్పుడే చెప్పారు..‘రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తప్పదు. మధ్యంతర ఎన్నికలు రానున్నాయి. ఐదేళ్ల పాటు మద్దతిస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పింది. కానీ ప్రస్తుతం ఆ అవకాశాలు లేవు’ అని ఇటీవల జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరలేపడంతో వెంటనే మాట మార్చారు. తాను అసెంబ్లీ ఎన్నికల గురించి అనలేదని, స్థానిక ఎన్నికల గురించి ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. అయితే తాజా పరిణామాలతో  దేవెగౌడ వ్యాఖ్యలు నిజమవుతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.