గడ్డుకాలం (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గడ్డుకాలం (పశ్చిమగోదావరి)

ఏలూరు, జూలై 26 (way2newstv.com):
కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న పౌల్ట్రీ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో మరో గడ్డు పరిస్థితి ఎదురైంది. పశ్చిమ బంగ, ఒడిశా, అసోం రాష్ట్రాల్లో శ్రావణ మాసం ప్రారంభం కావడంతో అక్కడి వ్యాపారులు గుడ్డు నిల్వలు తగ్గించుకుంటున్నారు. దీంతో జిల్లా నుంచి ఎగుమతులు తగ్గటంతో పాటు ధర కూడా తగ్గింది. అయిదు రోజుల కిందటి ధరతో పోల్చితే గుడ్డుకు 50పైసల మేర నష్టపోవాల్సి వస్తోంది. కోళ్ల మేత ధరలు, నిర్వహణ వ్యయాలు పెరగడంతో గుడ్డు ఉత్పత్తి వ్యయం రూ.4.30 వరకు అవుతుండగా రైతు చేతికొస్తోంది మాత్రం రూ.3.52. మార్చి నెలలో 120 లారీల వరకు ఎగుమతి కాగా రెండ్రోజులుగా 90 లారీలే అవుతున్నట్లు పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కోళ్లకు ప్రధాన ఆహారమైన మొక్కజొన్న ధర భారీగా పెరిగింది. వర్షాభావ పరిస్థితులు, పంటకు వస్తున్న తెగుళ్ల కారణంగా సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. 
గడ్డుకాలం (పశ్చిమగోదావరి)

దీనిని ఆసరాగా చేసుకొని.. దళారులు అధిక మొత్తంలో మొక్కజొన్నను నిల్వ చేసి.. కృతిమ కొరత సృష్టించడమే ప్రస్తుత ధర పెరుగుదలకు కారణమని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. క్వింటాల్‌ రూ.2600 వరకు పలుకుతోంది. దీంతో పాటు నూకల ధరలూ పెరిగాయి. గతంలో క్వింటాల్‌ రూ.1200 ఉండగా, ప్రస్తుతం రూ.1900 ఉంది. సోయాబీన్‌, చేప వంటివి నాణ్యతను బట్టి క్వింటాల్‌ రూ.3800 నుంచి రూ.4000 వరకు పలుకుతున్నాయి. మేత ధరలు పెరుగుదల అనేది గతంలో ఏడాదిలో నెల రోజుల పాటు ఉండేది. తదుపరి నవంబరు నుంచి కొత్త పంటలు మార్కెట్‌కు వచ్చాక పెరిగిన ధర ప్రభావం మేత ధరలపై అంతగా ఉండేది కాదు. ప్రస్తుతం సంవత్సరమంతా పెరిగిన ధరలతోనే మేత కొనుగోలు చేసి కోళ్లను పెంచటం రైతులకు ఆర్థిక భారంగా ?మారింది.ఈ ఏడాది వాతావరణం కోళ్ల పెంపకానికి ప్రతిబంధకంగా మారింది. జూన్‌ మొదటి వారంలో తొలకరి వర్షాలు కురిస్తే.. వేసవి తాపం నుంచి కోళ్లు కొంత ఉపశమనం పొందుతాయి. సక్రమంగా గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. అయితే ప్రస్తుత వాతావరణం మండు వేసవికి కొనసాగింపుగా తయారైంది. చల్లబడితే మార్కెట్లో గుడ్ల వినియోగం పెరుగుతుంది. అలాగే ఉత్పత్తి, వినియోగం ఒకే సారి పెరగడం కారణంగా మంచి ధర పొందే జూన్‌, జులై నెలలు ఈఏడాది పౌల్ట్రీ రంగానికి కలిసి రాలేదు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో శ్రావణం ప్రారంభం కావటంతో వినియోగం తగ్గడం వల్ల మంచి ధర పొందే అవకాశం లేకుండా పోయింది.