ఏపీఐఐసీలో అక్రమాల పుట్ట - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీఐఐసీలో అక్రమాల పుట్ట


రాజమండ్రి, జూన్ 3, (way2newstv.com
దళితులకు అసైన్ చేసిన పట్టా భూముల్లో రూ.కోట్ల విలువైన గ్రావెల్ తవ్వకాలతో గత టీడీపీ ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు రాజకీయ పలుకుబడితో ఆ భూములను గుల్ల చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని రామేశ్వరం మెట్టగా పిలిచే ఈ ప్రాంతంలో అక్రమాల గుట్టను కొత్తగా జిల్లాకు వచ్చిన జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి చొరవతో ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. ఏపీఐఐసీ పారిశ్రామీకరణ పేరుతో ఈ ప్రాంతంలో దళితులకు చెందిన పట్టా భూములను అన్యాక్రాంతానికి పావులు కదిపారంటున్నారు. ఈ నేపధ్యంలో దళితులకు చెందిన వందలాది పట్టా భూముల్లో గ్రావెల్ తవ్వకాలతో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇక్కడ భూములను గుల్ల చేశారు. అసలు విషయంలోకెళితే..తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రామేశ్వరం సొసైటీ ఎసైన్డ్ భూములు సర్వే నెంబర్ 1/2, 27/2,86/6 తదితర నెంబర్లలోని సుమారు 850 ఎకరాల భూమి 40 సంవత్సరాల క్రితం పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం, ఆనూరు, కొండపల్లి, రామేశ్వరంపేట, సూరంపాలెం గ్రామాలకు కేటాయించారు. ఈ ఐదు గ్రామాల ఎస్సీ కులస్థులకు ప్రభుత్వం కేటాయించి పట్టాలిచ్చింది. 

ఏపీఐఐసీలో అక్రమాల పుట్ట

ఈ భూములను ప్రజా ప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వానికి అవసరం ఉందని ఇటీవల అధికారులు ఈ భూముల రైతులతో సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన ఈ భూములపై ఆధారపడి 2500 మంది జీవిస్తున్నారు. మూడు వైపుల రోడ్లు కలిగి సుమారు 800 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ మెట్ట ప్రాంతంలో జీడిమామిడి తదితర పంటలు వేసుకుని జీవిస్తున్నారు. ఏవీ ఏ నేచురల్ రీసోర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు ఎకరా రూ.4 లక్షల చొప్పున ఖరీదుతో ఏపీఐఐసీతో సేకరించి కేటాయించేందుకు గత ప్రభుత్వంలోని పెద్దలు పావులు కదిపారు. ఈ మేరకు ఏపీఐఐసీని ఆదేశిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఏపీఐఐసీ ఈ మేరకు చర్యలు చేపట్టిందని తెలిసింది. ఈలోగానే దళితుల నుంచి స్థానిక రెవెన్యూ అధికారులు అనధికారికంగా చర్చలు జరిపి నయానో భయానో కొంత మంది నుంచి పట్టా భూములు నామమాత్ర ధరకు తీసుకుని అందులో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలోని కొంత మంది పెద్దల అండతో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇక్కడ రూ. కోట్ల విలువై గ్రావెల్‌ను తవ్వుకుపోయారు.విలువైన దళితుల భూములను గుల్ల చేశారు. అయితే ఒక వేళ నిజంగా ప్రభుత్వ ప్రయోజనాల రీత్యా భూములు అవసరమైతే ఏపీఐఐసీ ఈ భూములను సేకరించేలా ఉంటే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం సేకరించి తీసుకోవాలని దళితులు మరో వైపు ఆందోళన చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం ఈ ప్రాంతంలో భూమి ఎకరా రూ.30 లక్షల వరకు పలుకుతోంది. అయితే సర్వే నెంబర్ 1/1 తదితరాల్లో 10.25 ఎకరాల ప్రభుత్వ భూమి, సర్వే నెంబర్ 1/2 తదితరాల్లోని 799.87 ఎకరాల డి పట్టా భూమిని ఏవీ ఏ నేచురల్ రీసోర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు కేటాయించేందుకు పావులు కదిపారు.ఇదిలా ఉండగా కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే ఈ భూములను సేకరించాలని కోరుతూ దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం గత జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ మేరకు జిల్లా కలెక్టర్ గతంలోనే పెద్దాపురం ఆర్డీవోకు అప్పగించారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఎసైన్డ్ భూములు సేకరించాలంటే సెక్షన్ 11 ప్రకారం ప్రాధమిక ప్రకటన ప్రచురించాలని, ఇతర నిబంధనలన్నీ పాటించాల్సి ఉందని దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ అన్నారు. ఈ ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయపు విలువ ఎకరం రూ.30 లక్షలు ఉందని తెలిపారు. ఈ 850 ఎకరాలకు నాలుగు వైపులా విశాలమైన రహదారులు ఉన్నాయి. దీనితో ఈ భూమి మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉంది. సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం ఈ భూమికి ఎకరానికి రెండున్నర రెట్లు విలువ చెల్లించాలని, అంటే ఎకరానికి రూ.75 లక్షలు చెల్లించాల్సి ఉందని అయినాపురపు సూర్యనారాయణ కలెక్టర్‌కు గతంలోనే ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. ఒక్కొక్క కుటుంబానికి ఎకరా 35 సెంట్ల భూమి ప్రభుత్వం వీరికి ఇచ్చింది. ఈ ఎకరా 35 సెంట్లపై ప్రస్తుతం నాలుగు కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని, ఈ భూసేకరణ వల్ల నష్టపోయే వారు షెడ్యూల్డ్ కులస్థులు కాబట్టి చట్టంలో పేర్కొన్న విధంగా అదనపు నష్టపరిహారం చెల్లించాల ఇదిలా ఉండగా ఈ భూమిపై ఏపీఐఐసీ చేపట్టిన చర్యలు, అనధికార మైనింగ్ ద్వారా గ్రావెల్ తవ్వకాలు తదితర అంశాలపై ప్రస్తుత జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపిస్తే గత ప్రభుత్వ హయాంలో అధికారులు, కొంత మంది పెద్దల వ్యవహారాలు బయటకు రానున్నాయని తెలుస్తోంది.