వానలొస్తే.... సంగతేంటి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వానలొస్తే.... సంగతేంటి

హైద్రాబాద్, జూలై 11, (way2newstv.com)
మహానగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికలతో నగరం భయంతో వణికిపోతోంది. వానాకాలం కష్టాలను ఎదుర్కొనేందుకు రౌండి ది క్లాక్ తాము సిద్దంగా ఉన్నామంటూ ప్రకటించుకునే జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు చినుకుపడితే ఎదురయ్యే చిక్కులను సైతం విప్పలేకపోతున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ వస్తున్న హెచ్చరికలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, నాలా పరివాహక ప్రాంతాలు, చెరువులు, కుంటల దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలతోనే నగరంలో రాకపోకలు నరకంగా మారాయి. గడిచిన కొద్ది రోజులుగా నగరంలో వాతావరణం బాగా చల్లబడి చిరుజల్లులు మొదలుకుని ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 
వానలొస్తే.... సంగతేంటి

ఇప్పటికే అత్యవసర బృందాలను సిద్దం చేశామని జీహెచ్‌ఎంసీ అధికారులు కొంత కాలం క్రితం ఎంతో హడావుడి ప్రకటన చేసినా, నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో చిన్న పాటి వర్షంతో రోడ్లపై నీరు నిలిచి, వాహనదారులు ఎదుర్కొనే కష్టాలను నివారించే నాథుడే కరవయ్యాడు. గతంలో ఓ మోస్తరుగా కురిసిన అకాల వర్షం కారణంగా శివారులోని బండారు లేఔట్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లోని పలు ప్రాంతాలు, అపార్ట్‌మెంట్లు నీట మునిగాయ.నీట మునిగే సుమారు ఇరవై ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించినా, అక్కడ నీరు చేరకుండా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా నాలా పరివాహక ప్రాంతాలు, నాలా పక్కనే ఉన్న ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా ఉండేందుకు గతంలో బండారి లేఔట్ నీట మునిగినపుడు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నాలాలపై సుమారు 12వేల పై చిలుకు ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. కొంతకాలం క్రితం వరకు జీహెచ్‌ఎంసీ అధికారులు నగరంలో 390 కిలోమీటర్ల పొడువున ఉన్న నాలాల్లో కేవలం ఎండాకాలంలో మాత్రమే పూడికను తొలగించే వారు, కానీ ఈ ప్రక్రియను ఏడాది మొత్తం నిరంతరంగా చేపట్టాలని మున్సిపల్ మంత్రి ఆదేశించటంతో ఇప్పటి వరకు ఈ ప్రక్రియ 70 శాతం కూడా పూర్తికాలేదు.సెంట్రల్ జోన్‌లో పూడిక తరలింపునలో వెలుగుచూసిన కుంభకోణమే కారణమని, అది బహిర్గతం అయిన తర్వాత పూడికను తొలగించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో ప్రస్తుతం ఓ అరగంట సేపు గట్టిగా వర్షం కురిస్తే మళ్లీ నాలా పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితులు ఉన్నాయి. నగరంలో ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాలు కూడా ప్రజలను భయానికి గురి చేస్తున్నాయి. సుమారు వెయ్యి పైచిలుకు ఉన్న ఈ పాతకాలపు భవనాలకు కూడా నోటీసులు ఇచ్చామని, వీటిలో అవసరమైన వాటికి పటిష్టపు చర్యలు చేపడుతామని, మిగిలిన వాటిని కూల్చివేస్తామని ప్రకటించినా, నేటికీ అధికారులు నేలమట్టం చేసిన భవనాల సంఖ్య అంతంతమాత్రమే. దీంతో వాటికి ఇరువైపులా నివసించే వారు ఎపుడు వర్షం కురిస్తే, ఏం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్నారు.నాలా ఆక్రమణల్లో బాటిల్ నెక్ ప్రాంతాలు, నాలాల్లో నీరు సక్రమంగా ప్రవహించకుండా అడ్డుగా మారిన సుమారు 600 పైచిలుకు ఆక్రమణలను తొలగిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించింది. ఈ క్రమంలో ఆక్రమణల తొలగింపునకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా ప్రత్యేక విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేసినా, రూ.230 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేసినా, నేటికీ అధికారులు ఆక్రమణలను తొలగించలేకపోయారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన కొత్తలో తొలగింపు చర్యలు చేపట్టిన అధికారులు ఇప్పటి వరకు తొలగించిన ఆక్రమణల సంఖ్య అంతంతమాత్రంగా ఉంది.