కొండవీడును మరిచారా..? (గుంటూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొండవీడును మరిచారా..? (గుంటూరు)

గుంటూరు, జూలై 9 (way2newstv.com): 
జిల్లా రాజధానికి కేంద్రం కావడంతో కొండవీడును పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు పడ్డాయి. నాటి వైభవానికి వేదికైనా కొండవీడు కొండను చేరుకొనేందుకు రూ.34 కోట్లతో 5 కి.మీ మేర ఘాట్రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. దీంతో పాటు రూ.11.80 కోట్లతో ఘాట్‌రోడ్డు నుంచి కొండపై దేవాలయాలను కలిపే ఘాట్‌రోడ్డు, విశ్రాంతి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గత ఫిబ్రవరి 18 నుంచి మూడు రోజుల పాటు అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో కొండవీటి ఉత్సవాలను సైతం నిర్వహించారు. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు కొండవీడుపై నగర వనం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు ఆలయాల పునరుద్ధరణకు పురావస్తుశాఖ చర్యలు చేపట్టింది. ఘాట్‌రోడ్డు విద్యుద్దీకరణతో పాటు అన్ని పనులు చేపట్టడంతో రూపురేఖలు మారతాయని అంతా అనుకొన్నారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. అంతే అధికారులు ఎన్నికల క్రతువు మునిగిపోవడంతో కొండవీడు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. 
 కొండవీడును మరిచారా..? (గుంటూరు)


ఎన్నికల క్రతువు ముగిసినా గాని అధికారులు కొండవీడు వైపు తొంగిచూడటం మానేశారు. పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో కొండపై నిర్మాణాల కోసం తవ్విన గుంతలు, మట్టి దిబ్బలు దర్శనమిస్తున్నాయి. ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ఉత్సవాల సందర్భంగా నాటిన మొక్కలు నిలువునా ఎండిపోయాయి. రూ.కోట్లతో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి వృథాగా మారినట్లయింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని నిలిచిన పనులు తిరిగి ప్రారంభమయ్యేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. రాజధాని అమరావతి ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం పర్యటకంగా అభివృద్ధి చెందితే తమకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని కోరుకుంటున్నారు. కొండవీడు కొండలను కలుపుతూ కిలోమీటర్ల మేర నిర్మించిన ప్రాకారంలో మొత్తం 23 బురుజులున్నాయి. ఇవి అప్పట్లో నిరంతర కాపాలా స్థావరాలుగా ఉండేవని చెబుతారు. వాటిల్లో నెమళ్ల బురుజు అన్నింటిలో పెద్దది, పొడవైనది. ఇంకా సజ్జా మహల్‌ బురుజు, బిఖిల్లా బురుజు, మిర్యాల చట్టు బురుజు.. చెప్పుకోదగినవి. కొండపైకి మెట్ల మార్గం ద్వారా అడుగుపెట్టగానే నరసింహస్వామి ఆలయం, శివాలయం, బౌద్ధస్తూపం, మసీదు, వంటశాల, బ్రిటీష్‌ వారు వాడిన బంగ్లా, ఆయుధాగారం, ఇంకాస్త లోపలికి వెళ్తే లక్ష్మీనరసింహస్వామి ఆలయం, హనుమంతుడి స్వరూపం, వరాల కొట్టు, ముత్యాలమ్మ చెరువు, పుట్టలమ్మ చెరువు, వెదుళ్ల చెరువు, కారాగారం, నేతికొట్టు, అశ్వశాల, కుతుబ్‌షాహీల కాలంనాటి సమాధి, మండపం, తూర్పు ముఖ ద్వారం.. అలనాటి చారిత్రక వైభవానికి దర్పణాలుగా నిలుస్తాయి. రూ.34 కోట్లతో కొత్తపాలెం సమీపం నుంచి కొండవీడు కొండపైకి రెండు వరుసల ఘాట్‌రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో పాటు ఘాట్‌రోడ్డుకు ఇరువైపులా విద్యుద్దీకరణ పనులు కూడా పూర్తి చేశారు. రూ.11.80 కోట్లతో ఘాట్‌రోడ్డు నుంచి కొండపై ఆలయాలు, మసీదులు, చెరువులు చూసేందుకు ఏర్పాటు చేసే రహదారి పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించి అప్రోచ్‌ రహదారి మాత్రమే ఏర్పాటు చేశారు. అది కూడా వర్షాలకు అక్కడక్కడా కోతకు గురవుతుంది. ఇది పూర్తిస్థాయిలో పనులు చేపట్టి బీటీ రహదారి నిర్మించాల్సి ఉంది. ఈ పనులే ప్రస్తుతం నిలిచిపోయాయి. ఆలయాల పునరుద్ధరణకు సంబంధించి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఒక్క లక్ష్మీనరసింహస్వామి ఆలయం పనులు మినహా మిగిలిన పనులు ఏవీ జరగడం లేదు. కొండవీడు పర్యటనకు వచ్చే వారికి ఆహ్లాదం సంగతి దేెవుడెరుగు కనీసం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో లేవు. ఘాట్రోడ్డులో కొండ చరియలు విరిగిపడటంతో సురక్షిత ప్రయాణానికి అవకాశం లేకుండా పోయింది. చారిత్రక కట్టడాలను వీక్షించడానికి నలువైపులా కొండ శిఖరాలపై ఏరియల్‌ వ్యూ పాయింట్స్‌ను నిర్మిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. కొండవీడు ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత సందర్శనకు వచ్చే పర్యటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం, పండగ రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. 150 నుంచి 200 వరకు కార్లు వస్తున్నాయంటే పర్యటకులు ఏస్థాయిలో వస్తున్నారో అర్థమవుతుంది. కానీ పర్యవేక్షించాల్సిన అటవీ, పురావస్తుశాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. మరోవైపు వర్షం పడితే ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడి ప్రమాదకరంగా మారింది. దీంతో పాటు పర్యవేక్షణ లేకపోవడంతో ఆకతాయిల ఆగడాలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరగక ముందే అధికారులు చర్యలు చేపడితే పర్యటకులకు భద్రత ఉంటుంది. ఆ దిశగా అటవీ, పురావస్తు శాఖలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.