రాములోరి సన్నిధిలో నిశబ్ధమేనా..? (ఖమ్మం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాములోరి సన్నిధిలో నిశబ్ధమేనా..? (ఖమ్మం)

భద్రాచలం, జూలై 9 (way2newstv.com): 
జగన్మాత సీతమ్మకు జగదానందకారకుడు రామయ్యకు చేసే కల్యాణంలో సన్నాయి రాగాలు ఆధ్యాత్మికతను చాటుతుంటాయి. ఇందుకోసం శాశ్వత పోస్టుల్లో విద్వాంసులను నియమించారు. విధుల్లో ఉన్న వాళ్లు సైతం ఎలాంటి సమాచారం లేకుండా దేవుడి కల్యాణంలో ఈ వాయిద్యాలను వినిపించడం మానేస్తున్నారు. విజిటింగ్‌ అధికారుల పర్యవేక్షణ లేమి కారణంగా ఎవరిష్టం వారిదే అన్నట్లు పరిస్థితి మారింది. ఆదివారం సన్నాయి విద్వాంసుడు తన విధుల పట్ల అలసత్వం ప్రదర్శించారు. ఉదయం 8.30 నుంచి కల్యాణ క్రతువు ఆరంభమైనప్పటికీ ఒక్క సన్నాయి వాయిద్యం వినిపించలేదు. మూడు సన్నాయి పోస్టులకు గాను ఒక పోస్టు ఖాళీగా ఉంది. మూడు డోలు విద్వాంసుల పోస్టులకు గాను ఒక్కటి ఖాళీగా ఉంది. చాలాకాలంగా ఖాళీగా ఉన్న ఒక మృదంగం పోస్టును భర్తీ చేసేందుకు అధికారులు అంతులేని జాప్యం చేస్తున్నారు. తాళం ఒక పోస్టు ఉండగా ఇందులో మాత్రం ఖాళీ లేదు. సుప్రభాతం మొదలుకుని దర్బారు వరకు హరిదాసుల కీర్తనలకు విశేష ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఈ పోస్టును నింపడానికి మనసొప్పడం లేదు. శ్రుతి కళాకారుల విభాగంలో మూడు పోస్టులకు గాను ఒక్కరే ఉన్నారు. మిగతా రెండు పోస్టులను నింపడానికి సాంకేతిక చిక్కులు ఉన్నాయి.  
రాములోరి సన్నిధిలో నిశబ్ధమేనా..? (ఖమ్మం)

   
దేవుడి పూజల్లో మంత్రోచ్ఛారణలకు విశేష ప్రాధాన్యం ఉండగా ఈ సంగీత వాయిద్యాలతో చేసే ఆరాధనకు కూడా అంతే ప్రాధాన్యం ఉందన్నది వాస్తవం. వాయిద్య నిపుణుల ఖాళీలను నింపేందుకు చొరవ చూపలేకపోతున్నారు. ఈ క్రమంలో ఉన్న కొద్ది పాటి సిబ్బందితో నిబంధనల ప్రకారం పని చేపించుకోవాల్సిన పర్యవేక్షకులు ఎందుకోగానీ ఏమీ పట్టనట్లు ఉంటున్నారు. ఇదే అలుసుగా ఆదివారం ఒక సన్నాయి విద్వాంసుడు లేకుండానే కల్యాణ క్రతువును కానిచ్చారు. సెలవు దినం కావడంతో 100 జంటలు దేవుడి కల్యాణాలు చేపించాయి. వర్షం వస్తుందనే ఉద్దేశంతో నిత్య కల్యాణాన్ని బేడా మండపంలో కాకుండా దానికి పక్కనే ఉన్న వేద పండితుల మండపంలో చేయాల్సి వచ్చింది. దీని సామర్థ్యానికి మించి జంటలు రావడంతో మెట్లపై కూర్చోవాల్సి వచ్చింది. వర్షాకాలంలో ఇలాంటి చిక్కు సమస్యలు తలెత్తే వీలున్నందున బేడా మండపంలో వర్షం పడకుండా చర్యలు తీసుకుంటేనే ఈ ఇబ్బంది తొలుగుతుంది. మరుగుదొడ్లను శుభ్రం చేసే పనిలో దాదాపు రెండు దశాబ్దాలుగా పని చేస్తున్న ఓ కార్మికుడు నాలుగు రోజుల కిందట ఆలయ మెట్ల వద్ద కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత తోటి కార్మికులు ఆసుపత్రిలో చేర్పించగా తలకు కుట్లు వేశారు. రామాలయ కార్యాలయ అవసరాలకు పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈఎస్‌ఐ సదుపాయం ఉన్నప్పటికీ ఈ కార్మికుడికి ఈ తరహా వైద్యం అందడం లేదు. ఈఎస్‌ఐ కింద ప్రతీ నెల కొంత మొత్తం వేతనం నుంచి కోత పెడుతున్నప్పటికీ ఇప్పటి వరకు సదరు కార్మికుడికి కార్డును జారీ చేయలేదు. దేవుణ్ని నమ్ముకుని జీవిత కాలం పని చేసిన కార్మికులకు గుత్తేదారులు న్యాయం చేసేలా అధికారులు చొరవ చూపితే బాగు. ఇంతకు ముందు కూడా ఇద్దరు గుమాస్తాలు వేర్వేరు ప్రమాదాలలో గాయపడగా వీళ్లకు ఎలాంటి సాయం అందించలేదు.