ఆక్రమణలు అనంతం(అనంతపురం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆక్రమణలు అనంతం(అనంతపురం)

అనంతపురం, జూలై 19 (way2newstv.com):  
నగరంలో ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఏకంగా రహదారులు, కాలువలు ఆక్రమించి మరీ నిర్మాణాలు చేపడుతున్నారు. రహదారులకు ఇరువైపులా కాలువలు దాటి ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. కాసుల కక్కుర్తితో పలువురు అడ్డగోలు అనుమతులు ఇవ్వడం.. ఆక్రమణలు కళ్లెదుటే కన్పిస్తున్నా.. చూసీ చూడనట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది. ఈ అక్రమ నిర్మాణాల తీరుతో సుందరంగా రూపుదిద్దుకోవాల్సిన నగరం సహజత్వాన్ని కోల్పోతోంది. మరిన్ని ట్రాఫిక్‌.. పారిశుద్ధ్య సమస్యలను ఉత్పన్నం చేస్తోంది. టౌన్ ప్లానింగ్ అధికారుల ధోరణి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. 
ఆక్రమణలు అనంతం(అనంతపురం)

రాబోయే ఇరవై ఏళ్లలో పెరిగే జనాభాను దృష్టిలో ఉంచుకుని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. దీని ప్రకారం విశాలమైన దారులు, మెరుగైన మురుగు నీటి పారుదల వ్యవస్థ ఉండాల్సిందే. వాటికి అనుగుణంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి. ఈ మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయాల్సిన అధికారులే నిర్లక్ష్యం చేయడంతో నగరంలో అడ్డుగోలు నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇటువంటి అక్రమ నిర్మాణాలతో చిన్నపాటి వర్షాలు కురిసినా నగర వీధులు నీటిలో మునిగిపోతున్నాయి. రోడ్లన్నీ వంకలు, కాలువలను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి, దుకాణాల్లోకి సైతం వాన నీరు చేరుతోంది. చిన్నపాటి వర్షానికే ఇలా అయిపోతే భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఏమిటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. గతేడాది కురిసిన కుండపోత వర్షానికి కొన్ని కాలనీలు జలమయమైన సంగతి తెలిసిందే.నగరంలో కొంతకాలంగా ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగింది. ప్రధాన రహదారులే కాకుండా చిన్న రోడ్లలో కూడా ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. అవసరమైనన్ని రోడ్లు ఉన్నా, అవి ఆక్రమణలకు గురవడంతో వాహనాలను రోడ్లపైనే ఆపేస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్యలను తీర్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆక్రమణలు తొలగించేవరకూ ఈ సమస్య ఇలానే ఉంటుంది. రహదారులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు వందల సంఖ్యలో ఉన్నాయి. సాయినగర్‌, ఆదర్శనగర్‌, రామ్‌నగర్‌, ఆర్కే నగర్‌, హౌసింగ్‌ బోర్డు కాలనీ, మారుతీ నగర్‌, అరవిందనగర్‌, విద్యుత్తు నగర్‌, జీసస్‌ నగర్‌లో ఎక్కువగా ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. కానీ ఇప్పటికీ వాటిపై చర్యలు తీసుకోలేదు. సకాలంలో చర్యలు చేపట్టనందున ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల వెలుస్తున్న కొత్త భవనాలన్నీ దాదాపుగా రోడ్ల స్థలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలే.నగరంలో ఎక్కడా ఎటువంటి ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు జరగకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత నగరపాలిక అధికారులపై ఉంది. ఇచ్చిన అనుమతుల మేరకు భవనాలు నిర్మిస్తున్నారా లేదా అనేది చూడాల్సింది కూడా వారే. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలు జరిగినా నిర్మాణ దశలోనే వాటిని అడ్డుకోవాలి. కానీ కొందరు అధికారులు ముడుపులు తీసుకుని ఆక్రమణదారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇదిలానే కొనసాగితే రానున్న రోజుల్లో ఊహించని మరెన్నో సమస్యలు నగరవాసులను వేధిస్తాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేలుకొని ఆక్రమణలను తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు.