కాలుష్యం.. కేరాఫ్ కర్నూలు (కర్నూలు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాలుష్యం.. కేరాఫ్ కర్నూలు (కర్నూలు)

కర్నూలు, జూలై 19 (way2newstv.com): 
నగరాన్ని కాలుష్య భూతం కమ్మేస్తోంది. ఓవైపు దుమ్ము.. మరోవైపు పొగ అన్న తీరున చుట్టుముట్టేసింది. ప్రమాణాలు పాటించకపోవడంతో సూక్ష్మ ధూళి కణాలు పరిమితికి మించి నమోదవుతున్నాయి. ఇది ప్రజారోగ్యంపై పొంచి ఉన్న ముప్పును సూచిస్తోంది. సమన్వయంగా పనిచేయాల్సిన వివిధ శాఖల అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించిన కాలుష్య నగరాల్లో కర్నూలు సైతం ఉండటం నగరవాసులను భయాందోళనలకు గురిచేస్తోంది. నగరంలో ఐదు ప్రదేశాల్లో పీఎం 10(సూక్ష్మ ధూళి కణాలు) పరిమితికి మించి నమోదవుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలో వెల్లడైంది. గాల్లోకి వెలువడే 40 రకాల వాయు కాలుష్య ఉద్గారాల్లో పీఎం 10, నైట్రోజన్‌ డై ఆక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్, అమ్మోనియా, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి ఐదు ప్రామాణికాలను ఆధారంగా చేసుకుని గాలి నాణ్యతను నిర్ధరిస్తారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిమితుల ప్రకారం పీఎం 10 సూక్ష్మ ధూళి కణాల వార్షిక సగటు ఒక ఘనపు మీటరు(క్యూబిక్‌) గాలిలో 60 మైక్రోగ్రాములకు మించి ఉండకూడదు. 
కాలుష్యం.. కేరాఫ్ కర్నూలు (కర్నూలు)

అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాల మేరకు 20 మైక్రోగ్రాములు మించకూడదు. 2011 నుంచి 2015 వరకు ఐదేళ్లు పరిశీలిస్తే నగరంలోని బళ్లారి చౌరస్తా, సీ క్యాంపు, పూలబజారు, రాజ్‌విహార్‌ సర్కిల్, కృష్ణానగర్‌లను కాలుష్య హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు. ఇక్కడ ప్రమాదకర స్థాయిలో పీఎం 10 నమోదైంది. సరాసరిన 73.5 మైక్రోగ్రాముల నుంచి 81.7 మైక్రోగ్రాములు(రాజ్‌విహార్‌ సర్కిల్‌) ధూళి పరిమాణం దాటేసింది. వీటితోపాటు కల్లూరు ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌ పరిధిలోనూ ఇదే పరిస్థితి. ఇక పీఎం 2.5(అతి సూక్ష్మ ధూళి కణాలు) పరిమితులకు లోబడే ఉన్నాయి.వాయు కాలుష్యం వెదజల్లుతున్న వాటిలో ఆటోలదే అసలు సమస్యగా అధికారులు గుర్తించారు. అధికారికంగా నగరంలో 30 వేల ఆటోలు తిరుగుతుండగా.. అనధికారికంగా ఆ సంఖ్య 40 వేల వరకు ఉంటుంది. ఆర్టీసీ బస్సులు 751 ఉన్నా.. నగరంలో ఆర్టీసీ రవాణా సౌకర్యం కల్పించకపోవడంతో ఆటోలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆటోల్లో ఎక్కువ భాగం 15ఏళ్లుగా ఉపయోగిస్తున్న పాత వాహనాలే కావడంతో కాలుష్యం వెదజల్లుతోంది. కర్నూలు నుంచి డోన్‌ వైపు 50 కి.మీ., ఆదోనివైపు 100 కి.మీ. పరిధిలో ఆర్‌టీఏ అధికారుల లెక్కల ప్రకారం ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, గూడ్సు వాహనాలు, ఆటోలు ఇలా మొత్తం 3,75,185 వాహనాలున్నట్లు గుర్తించారు.కార్పొరేషన్‌ పరిధిలో నిత్యం సేకరించే వ్యర్థాలు గార్గేయపురం డంపింగ్‌ యార్డులో వేస్తుంటారు. వీటిలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలన్నీ కలిసి ఉంటాయి. వీటిని బహిరంగంగా తగలబెడుతుండటంతో నగరం వైపు కాలుష్యం వెదజల్లుతున్నట్లు కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని గత కమిషనర్‌ ప్రశాంతి దృష్టికి తీసుకెళ్లగా కొద్దిరోజులు నిలిపివేసినా యథావిధిగా మళ్లీ బహిరంగంగా కాల్చేస్తున్నారు. నగరంలో రహదారుల విస్తరణ పూర్తికాకపోవడం మరో కారణం. ఇక చెత్త ఊడ్చే యంత్రాలు నగరంలో రెండే ఉన్నాయి. ఎక్కువ శాతం మనుషులతో నగర వీధులు ఊడ్పిస్తున్నారు. ఈ సమయంలో ధూళి గాల్లో కలుస్తోంది. నగరంలో సుమారు నాలుగు వేల భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటి నుంచి పది టన్నుల పైగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇదీ కాలుష్యానికి ఒక కారకమే.15 ఏళ్లు పైబడిన డొక్కు వాహనాలు నగరంలో తిరుగుతున్నా ఆర్టీఏ అధికారులు దృష్టి సారించడం లేదు. ఆర్టీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12 వాహనాలు పీయూసీ ధ్రువీకరణ పత్రాలు అందించేలా ఏర్పాటు చేసినా నిరుపయోగమే. మరోవైపు పౌరసరఫరాల శాఖ కల్తీ ఇంధనాలను అరికట్టడం లేదు. ఇదీ కాలుష్యానికి ఒక కారణంగా నిలుస్తోంది. డీజిల్, పెట్రోలు బంకుల్లో కల్తీ కలపడం వల్ల ధూళికణాలు అధికంగా ఉత్పన్నమవుతున్నాయి. పురపాలక శాఖ చెత్తను బహిరంగంగా తగులబెట్టడం, భవన నిర్మాణాల సమయంలో వచ్చే వ్యర్థాలను రోడ్ల పక్కనే వేస్తున్నా నిలువరించకపోవడం చేస్తున్నాయి. ఆర్టీసీ నగరంలో బస్సులు ఏర్పాటు చేయకపోవడంతోనే ఆటోలకు డిమాండ్‌ పెరిగింది. పోలీసు శాఖ సైతం వాహనాలకు పీయూసీ ధ్రువీకరణ పత్రం పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇలా ఈ శాఖలు సమన్వయంగా పనిచేయాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు పడటం లేదనేది వాస్తవం. ఫలితంగా ప్రజారోగ్యం పణంగా పెట్టాల్సి వస్తోంది.