జగన్ మాట ఇచ్చారంటే తప్పరు. తనకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఖాయం అంటున్నారు చల్లా రామకృష్ణా రెడ్డి. చట్ట సభల్లోకి అడుగు పెట్టాలని చల్లా రామకృష్ణారెడ్డి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఆయనకు కాలం కలసి రావడం లేదు. గత కొన్నేళ్లుగా ఆయన చట్ట సభలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లి లో పట్టున్న నేతగా పేరున్న చల్లా రామకృష్ణారెడ్డి 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు.తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చారు. కానీ ఐదేళ్లలో అనేక అవకాశాలు లభించినా చల్లా పేరును చంద్రబాబు పరిశీలించలేదు.
చల్లాకు లైన్ క్లియర్..
చివరకు ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ పదవి ఇవ్వడంతో చల్లా రామకృష్ణారెడ్డి దానిని తిరస్కరించారు. పౌరసరఫరాల శాఖ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. దీంతో కొంత సంతృప్తి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరే ముందు ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు భగీరధ రెడ్డి రాజకీయ భవిష్యత్ పై చర్చించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ జగన్ మాత్రం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చల్లాకు హామీ ఇచ్చారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అనుకున్నట్లుగానే బనగానపల్లిలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి విజయానికి చల్లా కృషి చేశారు. గెలిపించారు. దీంతో చల్లా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెంచుకున్నారు.కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందడం చల్లాకు కలసి వచ్చే అంశమని చెబుతున్నారు. మంత్రి వర్గ విస్తరణలో రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వని జగన్ ఎమ్మెల్సీ పదవుల విషయంలో ఆ పనిచేయరని అంటున్నారు. ఇప్పటికే అనంతపురం నుంచి హిందూపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇక్బాల్ అహ్మద్ కు ఎమ్మెల్సీ పదవిని జగన్ ప్రకటించారు. బీసీలకు రాయలసీమలో ఎక్కువ సీట్లు ఇవ్వడంతో ఖచ్చితంగా చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖాయమంటున్నాయి వైసీపీ వర్గాలు.