ఆయన రాజకీయాల్లో అన్నీ చూసేశారు. దాదాపుగా చరమాంకంలో ఉన్నారు. కానీ ఆశలు మాత్రం కొత్త ఊసులు చెబుతున్నాయి. ఇంకా ఏవేవో కోరుకుంటున్నాయి. ఆయనే రెండు దశాబ్దాల పాటు వరసగా ఎమ్మెల్యేగా నెగ్గి, పలుమార్లు మంత్రిగా పనిచేసిన విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన దిగ్గజ నేత. దాడి వీరభద్రరావు 1985 నుంచి 2012 వరకూ అంటే 27 ఏళ్ల పాటు టీడీపీతోనే రాజకీయం నెరిపారు, మెరిసారు. ఆయన పదవులన్నీ కూడా అక్కడ నుంచి వచ్చినవే. మంత్రిగా, శాసనమండలిలో టీడీపీ పక్ష నేతగా దాడి తమ మార్క్ చూపించారు. రెండవమారు కూడా తనకు ఎమ్మెల్సీ కొనసాగింపు జరగకపోవడంతో బాబు వైఖరికి విరక్తి చెంది ఒక్కసారిగా సైకిల్ దిగిపోయారు. అదే దూకుడుతో అప్పట్లో జైల్లో ఉన్న జగన్ని కలసి మరీ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
ఆశల పల్లకిలో దాడి
ఇక తనకు ఇంకా రాజకీయం చేయాలని ఉన్నా పదవుల ఆశ ఉన్నా కూడా యువకుడైన జగన్ నాయకత్వంలో పనిచేయడం ఎందుకో నామోషీ అని భావించారో ఏమో ఆప్పట్లో కొడుకునే ముందు పెట్టి దాడి వీరభద్రరావు తాను వెనక ఉన్నారు. 2014లో కోరుకున్న అనకాపల్లి సీటు దక్కలేదు. విశాఖ పశ్చిమం ఇచ్చారు. ఆ అసంతృప్తిలోనే కొడుకుతో పోటీ చేయిందిన దాడి చివరికి ఓడిపోయారు. మరుసటి రోజే జగన్ని నానా మాటలు తిడుతూ వైసీపీకి రాజీనామా చేసారు. జగన్ నియంతని, రాజకీయ లక్షణాలు, నాయకత్వ ప్రతిభ లేనే లేవని దుమ్మెత్తిపోశారు.చిత్రంగా అదే గూటికి మళ్ళీ దాడి వీరభద్రరావు చేరుకోవడమే రాజకీయ మ్యాజిక్ మరి. తాజా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన దాడికి మళ్ళీ మొండి చేయి చూపించారు జగన్. కానీ అభయహస్తం కూడా ఇచ్చారు. టికెట్ ఇవ్వకపోయినా పార్టీ అధికారంలోకి వస్తే తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇపుడు బంపర్ మెజారిటీతో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో దాడి ఆనందానికి అవధులు లేవు. మాట తప్పని జగన్ తనకు తప్పకుండా న్యాయం చేస్తారని ఆయన ఆశిస్తున్నారు. తనకు ఎమ్మెల్సీ వంటి పదవి ఇచ్చి రాజకీయాల్లో కీలకంగా చేస్తారన్న నమ్మకం కూడా దాడికి ఉన్నట్లుగా ఉంది. అందుకే ఆ ఆనందంలో ఈసారి జన్మ దిన వేడుకలు అనుచరులు భారీగా చేశారు. విశాఖ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న దాడికి జగన్ తగిన హోదాను గౌరవాన్ని ఇస్తారని అంతా అనుకుంటున్నారు. మరి అదృష్టం అంటే ఇదేనేమో జీవిత చరమాంకంలో కూడా తలుపు తడుతుందేమో చూడాలి.