యాప్ తో అంగన్ వాడీల మానిటరింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యాప్ తో అంగన్ వాడీల మానిటరింగ్

కరీంనగర్, జూలై 11, (way2newstv.com)
అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలకు ఇక చెక్ పడినట్లే.అంగన్‌వాడీ మానిటరింగ్  పేరిట యాప్ అందుబాటులోకి వచ్చింది. సీడీపీవోలు, సూపర్‌వైజర్లు వినియోగించేలా రూపొందించిన ఈ యాప్ ద్వారా ఎవరెవరు ఏం చేస్తున్నారో అధికారులకు పక్కా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.బయోమెట్రిక్ విధానం అమలుతో సూపర్‌వైజర్లు, ఉద్యోగుల పనితీరు గాడిలో పడుతుందని భావిస్తున్నారు. ఇకమీదట వారి పనితీరు ఎప్పటికప్పుడు పై అధికారుల దృష్టికి వెళ్లనుండటంతో పాలనా వ్యవహారాల తీరు సక్రమంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రతి పని బయోమెట్రిక్ పుణ్యమా అంటూ డైరెక్టర్ కనుసన్నల్లో ఉంటుంది. ఆరు నెలల నుంచి ఆరేండ్ల వయసు కలిగిన పిల్లలకు ఆటపాటలతో చదువు, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడంతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. 
యాప్ తో అంగన్ వాడీల మానిటరింగ్

అయితే ఆయా కేంద్రాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు కళ్లెం వేస్తూ వాటి పనితీరును పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా ఎం-అంగన్‌వాడీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.  ఒకవేళ ఉద్యోగులు ఏదైనా కేంద్రం తనిఖీకి వెళ్లినా, జిల్లాకేంద్రంలో సమావేశానికి వెళ్లినా అక్కడి ఫొటోను ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సీడీపీవో కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం అందుబాటులోకి రావడంతో టూర్‌కు వెళ్లని పక్షంలో ఇక్కడ హాజరు నమోదు చేయాలి. తద్వారా ఎవరు కూడా సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. ఈ విధానం జిల్లాలో తాజాగా అమల్లోకి రాగా..చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో సమస్యలను పరిష్కరించడంపై సిబ్బంది దృష్టి సారించారు. తరచూ విధులకు ఎగనామం పెట్టే అంగన్‌వాడీ ఉద్యోగులతో పాటు అక్రమాలకు పాల్పడే వారికి యాప్ అమలుతో చెక్ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. టూర్ల పేరిట కేంద్రాల తనిఖీకి వెళ్లినా, ఏదైనా పని నిమిత్తం కార్యాలయానికి వెళ్లినా అక్కడి ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి, లేకుంటే వేతనంలో కోత విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సీడీపీవో కార్యాలయాల్లో సైతం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తుండడంతో ఇక ఉద్యోగులు తప్పకుండా సమయపాలన పాటించాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రైవేట్ పాఠశాలల కారణంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతుండటంతో ప్రీ స్కూల్ పేరిట వారికి ఆంగ్ల మాధ్యమాన్ని కూడా పరిచయం చేస్తున్నారు. అయితే కేంద్రాల్లో పిల్లలు తక్కువగా ఉన్నా ఎక్కువగా చూపడం, ఒకే చిన్నారి పేరును ఇటు తల్లి, అటు అత్తమ్మతో కలిపి నమోదు చేసుకోవడం, వారి పేరిట వచ్చే సరుకులను స్వాహా చేయడం వంటి అక్రమాలు పలు కేంద్రాల్లో సాగుతున్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. వీటిని అరికట్టేందుకు పిల్లల హాజరుశాతాన్ని ఆధార్‌తో అనుసంధానించారు. ఈ మేరకు కేంద్రాలకు సైతం జియోట్యాగింగ్ చేశారు. జిల్లాలో ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు 809 ఉండగా, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 55 కలిపి మొత్తం 864 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. అందులో బాలింతలు 3, 438, గర్భిణులు 3, 696, ఆరు నెలల నుంచి మూడేండ్ల లోపు ఉన్న చిన్నారులు 26, 616, 9, 784 మంది మూడు నుంచి ఆరేండ్లలోపు చిన్నారులు ఉన్నారు. అంగన్‌వాడీ మానిటరింగ్ యాప్‌లో జిల్లాలోని సూపర్‌వైజర్లు, సీడీపీవోలతో పాటు జిల్లా సంక్షేమ అధికారి, రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ ఉంటారు. సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన ప్రతిరోజు అక్కడి ఫొటో, ఒకవేళ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఫొటో దిగి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో టూర్ పేరిట వారి సొంత పనికి వెళ్లే అవకాశం ఉండదు. అలాగే ఐసీడీఎస్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. సూపర్‌వైజర్ల టూర్‌కు వెళ్లని పక్షంలో కార్యాలయానికి వచ్చి బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలి.