అక్టోబరు నుంచి రైతులకు ఆర్థిక సాయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అక్టోబరు నుంచి రైతులకు ఆర్థిక సాయం

విజయవాడ, జూలై 24 (way2newstv.com):
రాష్ట్రంలోని రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. . వైఎస్సార్‌ రైతు భరోసా పథకం గురించి స్పష్టత ఇచ్చారు. ఈ పథకం కింద ఏడాదికి రైతులకు రూ. 12,500 ఇస్తామని చెప్పారు. 64లక్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందుతారని, ఇందులో 16లక్షల మంది కౌలు రైతులు ఉన్నాయని ఆయన తెలిపారు. 
అక్టోబరు నుంచి  రైతులకు ఆర్థిక సాయం

ఈ పథకంలో భాగంగా ఈ ఏడాది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.8,750 కోట్లు బడ్జెట్‌లో కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. రూ. 87వేల కోట్ల రైతు రుణాలు ఉంటే.. రకరకాల సాకులు చూపించి.. రూ. 24వేల కోట్లకు మాత్రమే కుదించారని బుగ్గన తెలిపారు. రుణమాఫీ కోసం రూ. 16,512 కోట్లు కేటాయించి.. అందులో కేవలం రూ. 10,279 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. టీడీపీ ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయలేకపోయిందన్నారు. నీరు-చెట్టు పథకం పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని, కేటాయింపులకు మించి ఆరు రెట్లు అదనంగా ఖర్చు పెట్టి.. టీడీపీ నేతలు తమ జేబులు నింపుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సర్కార్‌ ప్రవేశపెట్టిన ఓటాన్‌ బడ్జెట్‌లో రుణమాఫీకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని బుగ్గన వెల్లడించారు.