మహబూబ్ నగర్, జూలై 18 (way2newstv.com):
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో సందర్శకులకు వసతులలేమి ఇబ్బందులు కలిగిస్తోంది. ఇందులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థినులు ఉంటున్నారు. ప్రతి ఆదివారం తల్లిదండ్రులు పిల్లలను చూసేందుకు వస్తుంటారు. సందర్శకులకు ప్రత్యేకంగా గదులు నిర్మించి కనీస వసతులు కల్పిస్తామని ఏటా అధికారులు చెబుతున్నా కార్యరూపం దాల్చడంలేదు. దీనిపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో 17,200 మంది విద్యార్థినులు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో చదువుకునే వారంతా పేద, వలస కుటుంబాలకు చెందిన పిల్లలే.. తల్లిదండ్రులు సెలవు రోజుల్లో వచ్చి పిల్లలకు అవసరమైన సామగ్రి ఇస్తూ యోగ క్షేమాలు తెలుసుకొని వెళ్తుంటారు.
వసతుల్లేవ్..! (మహబూబ్ నగర్)
సందర్శకులుగా వచ్చే తల్లిదండ్రులకు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులదే అయినా పట్టించుకోవడంలేదు. వాస్తవానికి తాగునీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్డి, నీడ లాంటి సౌకర్యాలు కల్పించాలి. వీటిలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోవడం లేదు. గురుకులాల్లో సందర్శకుల విడిది కోసం ప్రత్యేకంగా హాల్ నిర్మించారు. ఇలాంటివే కేజీబీవీల్లోనూ నిర్మిస్తామని అధికారులు చెబుతూ వస్తున్నారు తప్ప నిర్మించలేకపోతున్నారు. చాలాచోట్ల తల్లిదండ్రులు పిల్లలకు ఇష్టమైన భోజనాలు తీసుకొస్తారు. చేతులు శుభ్రం చేసుకొని పిల్లలకు తినిపిద్దామని ఆశ ఉంటున్నా అందుబాటులో నీళ్లు ఉండటంలేదు. ధన్వాడలోని కేజీబీవీలో అసంపూర్తిగా ప్రహరీ ఉండటంతో పందుల బెడద ఇబ్బంది పెడుతోంది. ఉన్నచోటుకు పందులు వస్తూ అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. అత్యవసరంగా మూత్ర విసర్జన, బహిర్భూమికి వెళ్లాలంటే వచ్చినవారికి ఆరుబయలే దిక్కవుతున్నాయి.ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో సందర్శనకు వచ్చిన సమయంలో వాన పడితే తడిసి ముద్దవ్వాల్సిందే తప్పా తల దాచుకోడానికి స్థలమే ఉండదు. ఇప్పటికి రెండు విడతలుగా 24 కేజీబీవీలను ఇంటర్ స్థాయికి చేర్చారు. రాబోవు రోజుల్లో మిగతా వాటిలోనూ ఇంటర్ విద్య అమలు కానుంది. కొత్త వాటిలోనూ ఏటా తరగతుల సంఖ్య పెంచుతూ పోతున్నారు. దీంతోపాటు విద్యార్థినుల సంఖ్య అధికమవుతోంది. సందర్శకుల సంఖ్య ఇదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని సందర్శకుల కోసం గురుకులాల్లో నిర్మించిన రీతిలో కేజీబీవీల్లోనూ నిరీక్షణకు గదులు నిర్మిస్తే బాగుంటుందని విద్యార్థినుల తల్లిదండ్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:
telangananews