నల్లారి చూపు...కమలం వైపు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నల్లారి చూపు...కమలం వైపు

తిరుపతి, జూలై 25, (way2newstv.com)
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తాను టీడీపీని వీడేది లేదని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పార్టీ మారతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.2019 ఎన్నికలకు ముందు వరకూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. రాష్ట్ర రాజకీయాలను పట్టించుకోలేదు. తన సోదరుడు టీడీపీలోకి వెళతానన్నప్పటికీ ఆయన అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేసిన తాను ఇక రాజకీయాల నుంచి దూరంగా ఉండటమే మేలని భావించారు. అయితే అనూహ్యంగా మొన్నటి ఎన్నికల ముందు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి తాను పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేస్తానని చెప్పారు.
నల్లారి చూపు...కమలం వైపు

అయితే ఈ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డికి రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. రెండు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడం. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో వచ్చినా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దగా ఇబ్బందిగా ఉండేది కాదు. అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పవర్ లోకి వచ్చినా తన సోదరుడు జిల్లాలో చక్రం తిప్పేవారు. ఈ రెండు జరగకపోవడంతో ఇప్పుడు తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక వెలుగు వెలిగి పోతున్నారు.పెద్దిరెడ్డిని అడ్డుకోవడం నల్లారి సోదరుల వల్ల కావడం లేదు. రాజకీయంగా తమ కుటుంబం జిల్లాలో మనుగడ సాగించాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోకతప్పదని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాలని భావిస్తున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి పెద్దిరెడ్డిని ధీటుగా ఎదుర్కొనవచ్చని, అవసరమైతే కేంద్రం సాయంతో పెద్దిరెడ్డిపై పగ తీర్చుకోవచ్చని నల్లారి సోదరులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కమలం పార్టీవైపు చూస్తున్నట్లు టాక్.