హైద్రాబాద్, ఆగస్టు 22, (way2newstv.com)
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తి పోతల ప్రాజెక్టు ఎన్నో ప్రశంసలతో.. విమర్శలు కూడా మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు విషయంలో ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం అంచనా వ్యయం పెంచి, ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయిని, దీనిపై సీబీఐ విచారణ కూడా జరిపించాలని బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుకు సంబంధించి మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
30 కోట్లతో కాళేశ్వరం ప్రచారం
ప్రాజెక్టుకు ప్రచారం కల్పించాలని హంగూ ఆర్భాటాలకు పోయిన ప్రభుత్వం అనవసర ఖర్చులు చేస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం వెండి జ్ఞాపికలను ప్రదానం చేసింది. అయితే, ఈ జ్ఞాపికల కోసం ఏకంగా రూ. 1.66 కోట్లు ఖర్చు చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఈ ఖర్చుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణానికి పెడుతున్న ఖర్చుతో తెలంగాణ ప్రజలపై భారం మోపుతుంటే.. ఈ అనవసర ఖర్చులు అవసరమా? అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వెండి ప్లేట్లకు అంత ఖర్చా? అంటూ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కూడలిలో వీడియోలు ప్రదర్శించారు. అయితే కాళేశ్వరం ఘనత ఖండాతరాలకు విస్తరించిందనీ, అమెరికా మీడియా కూడా ప్రాజెక్టు గొప్పదనాన్ని గుర్తించిందటూ తెలంగాణ స్థానిక పత్రికలు, టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ప్రచారం ఊదరగొట్టాయి. అయితే అదంతా ప్రభుత్వ ప్రచార యావే అని తేలింది. కాళేశ్వరం ప్రాజక్టు గురించి తెలంగాణ ప్రభుత్వమే ప్రచారం చేయిస్తోందని తెలిసింది. టైమ్స్ స్క్వేర్‌లో ప్రకటనలకు నెలకు సుమారు రూ. 30 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా టైమ్స్ స్క్వేర్‌కు భారీ మొత్తంలో చెల్లిస్తున్నట్లు తెలిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.