కాకినాడ, ఆగస్టు 28 (way2newstv.com):
రైతులకు సేవలందించేందుకు సహకార సంఘాలు ఏర్పడ్డాయి. సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించటం ద్వారా రైతుల అవసరాలను తీర్చటమే వాటి పరమావధి ఇలాంటి సొసైటీలకు పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.2 లక్షల నగదు ప్రోత్సాహకం అందిస్తామని ఏడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వాలు మారినా, పాలకవర్గాల పదవీకాలం ముగిసినా నేటికీ ప్రోత్సాహకాలు అందలేదు. జిల్లాలో 302 సహకార సంఘాలున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు 2013లో సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏకగ్రీవంగా పాలక వర్గాలను ఎన్నుకున్న సొసైటీలకు రూ.2 లక్షల నగదు ఇస్తామని ప్రకటించింది.
ప్రోత్సాహం ఏదీ..? (తూర్పుగోదావరి)
దీంతో ప్రోత్సాహకాలు అందితే సొసైటీలకు ఆర్థిక దన్ను ఏర్పడుతుందనే ఆశతో చాలా సొసైటీల్లో పోటీ లేకుండా స్థానికులు ప్రయత్నించి, సఫలమయ్యారు. జిల్లాలో ఈవిధంగా 70 సంఘాల్లో పాలక వర్గాలను ఎన్నికలు అవసరం లేకుండా చేశారు. అధ్యక్షులు, డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక సొమ్ములు వస్తాయని ఎదురుచూసిన సొసైటీలకు నేటికీ అవి అందలేదు.ఏ ప్రభుత్వమైనా విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వాటిని అమలు చేయాల్సిందేనని పలువురు పేర్కొంటున్నారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తర్వాత తర్వాత 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో తెదేపా అధికారం చేపట్టింది. ఆ ప్రభుత్వం ఏకగ్రీవ సొసైటీలకు కాసులు ఇవ్వలేదు, ఎన్నికలు జరపలేదు. మూడుసార్లు పదవీ కాలాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొద్ది నెలల క్రితం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడూ ఎన్నికలు జరపలేదు. తాజాగా త్రిసభ్య కమిటీలను నియమించింది. ఇప్పటికైనా గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఏకగ్రీవమైన సొసైటీలకు రూ.2 లక్షల చొప్పున విడుదల చేయాలని సహకార సంఘాల ప్రతినిధులు, రైతులు కోరుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా ప్రభుత్వం ఈ విధానమే అమలుచేసిందని గుర్తుచేస్తున్నారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.5 లక్షల నగదును ప్రభుత్వం విడుదల చేసింది. సొసైటీలకు కూడా అలాగే విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. ఇలా చేస్తే భవిష్యత్తులో సొసైటీలకు ఎన్నికలలో పోటీలు తగ్గి ఏకగ్రీవమయ్యే అవకాశాలుంటాయని అభిప్రాయపడుతున్నారు.
Tags:
Andrapradeshnews