బెజవాడలో నైట్ లైఫ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బెజవాడలో నైట్ లైఫ్

విజయవాడ, ఆగస్టు 1, (way2newstv.com)
ఇక మళ్లీ అర్ధరాత్రి సందడి కానరానుంది. కమిషనరేట్ పరిధిలో నైట్‌లైఫ్‌కు మళ్లీ తెర లేచింది. హోటళ్ళు, రెస్టారెంట్లు యధావిధిగా తెల్లవారేవరకు కొనసాగనున్నాయి. అయితే భద్రతా ప్రమాణాలు పాటిస్తే చాలు. నైట్ విక్రయాలు చేసుకోవచ్చని ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. క్షేత్ర స్ధాయిలో పోలీసు అనుమతి ఉండాల్సిందే. గత చంద్రబాబు పాలనలో జారీ చేసిన జీఓ ప్రకారం నైట్ ఫుడ్ అమ్మకాలు విజయవంతంగా కొనసాగాయి. అయితే ఎన్నికల అనంతరం వైసీపీ పాలన వచ్చాక నైట్ అమ్మకాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గడిచిన 50 రోజులుగా అర్ధరాత్రి అమ్మకాలు లేక హోటళ్ళు, రెస్టారెంటు యజమానులు విలవిలలాడిపోయారు. 
బెజవాడలో నైట్ లైఫ్

పోలీసుల ఆదేశాలతో రాత్రి పదిన్నర గంటలకే హోటళ్ళు, రెస్టారెంట్లు మూసి వేస్తున్నారు. నగరంలో ఒక్క ఫుడ్‌కోర్టులు మాత్రమే కొనసాగుతున్నాయి. కస్టమర్ల నుంచి డిమాండు ఉన్నంత వరకు ఆ సమయానికి అనుగుణంగా ఫుడ్ కోర్టుల్లోని స్టాల్స్ పని చేస్తున్నాయి. వ్యాపారం తగ్గిపోతే స్టాల్స్ మూసేసి వ్యాపారులు వెనుదిరిగే పరిస్ధితి. జీఓ మాట ఎలా ఉన్నా నగరం మొత్తం మీద మాత్రం నైట్ అమ్మకాలకు పోలీసులు ప్రస్తుతానికి బ్రేక్ వేశారు. అయితే ఇక నుంచి పదిన్నర దాటి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా విక్రయాలు జరుపుకునే వెసులుబాటు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇస్తూ నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు సానుకూలంగా స్పందించారు. పోలీసుల ఆదేశాల మేరకు రాత్రి పదిన్నర గంటలకు హోటల్స్ రెస్టారెంట్లు మూసివేస్తున్నామని, దీనివల్ల వ్యాపార పరంగా చాలా నష్టం జరుగుతోందంటూ విజయవాడ హోటల్స్ మరియు రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియషన్ బుధవారం పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి విఙ్ఞప్తి చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ ది 15-10-2018 ప్రకారం రాత్రి 12 గంటల వరకు హోటల్స్, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతి ఉందని, దీనికి అనుగుణంగా పోలీసు సిబ్బందికి తగిన ఆదేశాలు ఇవ్వాలని సంఘం ప్రతినిధులు సీపీని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీపం తగిన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ సిసి టివి కెమేరాలు, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని, తగు జాగ్రత్తలు తీసుకుని అర్ధరాత్రి 12 గంటల వరకు నడుపుకోవాలని సూచించారు. దీంతో ఇక నుంచి నగర పోలీసు కమిషనరేట్‌లో పదిన్నర తర్వాత నుంచి 12 గంటల వరకు హోటళ్ళు, రెస్టారంట్లు నిరాటంకంగా పని చేయనున్నాయి