అర్ధం కాని సుజనా చౌదరి వ్యవహార శైలీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అర్ధం కాని సుజనా చౌదరి వ్యవహార శైలీ

గుంటూరు, ఆగస్టు 21, (way2newstv.com)
సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ తెరచాటు రాజకీయాల నుంచి బీజేపీలో చేరి మీడియా ముందు మాట్లాడే ముఖ్య నేతగా మారడం వెనక ఎంతో కధ నడిచింది. తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆర్ధిక వనరుగా ఉన్న సుజనా చౌదరి తరువాత కాలంలో రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ తరువాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో సహాయ మంత్రిగా కూడా బాబు చలవతో ప్రమోషన్ కొట్టేశారు. అన్నీ అయిపోయాక టీడీపీ సాంతం ఓటమి పాలు అయ్యాక సుజనా చౌదరి బీజేపీలో చేరిపోయారు. అది కూడా చంద్రబాబు ఇచ్చిన రాజ్యసభ సీటుని పదిలంగా వెంట ఉంచుకుని మరీ దూకేశారు. ఇపుడు సుజనా చౌదరి బీజేపీకి సంబంధించి ఏపీలో ప్రముఖ నాయకుడు.ఏపీకి సుజనా చౌదరి వస్తే కాషాయం పార్టీ నేతలు స్వాగతం పలుకుతున్నారు. ఆయన్ని సాదరంగా వెంట తీసుకువెళ్ళి మర్యాదలు చేస్తున్నారు. 
అర్ధం కాని సుజనా చౌదరి వ్యవహార శైలీ

కొన్ని నెలల క్రితం ఇదే సుజనా చౌదరి కంపెనీల మీద ఐటీ ఈడీ దాడులు జరిగితే ఏపీ మీద దాడులు చేస్తున్నారన్న స్థాయిలో గొంతు చించుకున్న అప్పటి సీఎం చంద్రబాబు, బాబుని విమర్శలతో చీల్చి చెండాడిన బీజేపీ నేతలు ఇపుడు అంతా గతం గతహా అయ్యారు. ఇపుడు సుజనా చౌదరి కేంద్ర మాజీ మంత్రి. మేధావి, తెలివైన నేతగా బీజేపీ నేతలకు కనిపిస్తూంటే చంద్రబాబుకు సైతం తన మనిషి బీజేపీలో ఒకరున్నారన్న సంతోషం ముఖంలో వెలిగిపోతోంది. ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ పర్యటనలో సుజనా చౌదరి వర్తమాన రాజకీయాల మీద తనదైన భాష్యాలు చెప్పారు. సుద్దులు కూడా వల్లించారు. రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలని మీడియాకు చెప్పి మరీ కళ్ళు తెరిపించారు.రాజకీయాల్లో నీతి అన్న మాట కోసం వెతకకూడదని సుజనాచౌదరి కొత్త సూక్తి వెల్లడించారు. రాజకీయాల్లో అలాంటివి ఉండవని ఆయనే చెప్పుకొచ్చారు. అంటే నైతిక విలువలతో కూడిన రాజకీయం అని అంతా అంటారు కదా. అదంటా వట్టి ట్రాష్ అని సుజనా చౌదరి కచ్చితంగా చెప్పేశారన్నమాట. అంతే కాదు, ఎవరైనా ఏ పార్టీలోనైనా చేరవచ్చు. పదవులు ఒక పార్టీలో తీసుకుని అవే పదవులతో వేరొక పార్టీలోకి హ్యాపీగా జంప్ చేయవచ్చు. నీతి నియమాలు అసలు వర్తించవని సుజనా చౌదరి అంటున్నారు నిజమే కదా ప్రత్యేక హోదా కావాలని కోరిన సుజనా కేంద్ర మంత్రి కాగానే హోదా కాలం చెల్లినదంటూ ఎంచక్కా మాట మార్చేశారుగా. ఇన్ని చెప్పిన సుజనా చౌదరి తాను మాత్రం చేరిన బీజేపీ సిధ్ధాంతాలకు కట్టుబడి ఉంటానని అంటున్నారు. నమ్మవచ్చా మరి.