ఏపీ క్యూఆర్ కోడ్ లో టెక్స్ట్ బుక్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీ క్యూఆర్ కోడ్ లో టెక్స్ట్ బుక్స్

విజయవాడ, ఆగస్టు 21, (way2newstv.com)
దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలకు 'క్యూఆర్‌ కోడ్‌'ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల సంబంధిత పుస్తకాలను చిన్నారులకు పంపిణీ చేశారు. దీనిలోభాగంగా పుసక్తం ప్రతి పేజీలోనూ క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించడం ఆనవాయితీ. ఏటా విద్యాశాఖ విషయ నిపుణులతో చర్చించి పలు మార్పులను తీసుకువస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఆధునిక విద్యావిధానానికి అనుగుణంగా ఉండేలా పాఠ్యపుస్తకాలను ఎంతో సుందరంగా, చిత్రాలతో వివరణలు అందించడమే కాకుండా ప్రస్తుతం ఆయా అంశాలకు సంబంధించిన లోతైన విశ్లేషణను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పాఠ్యపుస్తకాలలో క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించింది.
పీ క్యూఆర్ కోడ్ లో టెక్స్ట్ బుక్స్

పాఠ్యపుస్తకాలపై, పాఠ్యాంశాల స్థానంలో దీనిని ప్రవేశపెట్టడంతో ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఏర్పడింది. అదే సమయంలో సాధారణ విద్యార్థులు సైతం సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి ఒకమంచి అవకాశాన్ని కల్పించడం హర్షణీయం. ఆరు నుంచి పదో తరగతి వరకు గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో ప్రయోగాత్మకంగా క్యూఆర్‌కోడ్‌ను ముద్రించింది. యశ్‌పాల్‌ కమిటీ చేసిన సిఫారసులకు అనుగుణంగా పాఠ్యపుస్తకాల బరువును తగ్గించడానికి అనువైన రీతిలో ఆయా అంశాల స్థానంలో క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించడంతో ఆ విషయానికి సంబంధించి సమగ్రమైన సమాచారం అంతర్జాలంలో వీక్షించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా ప్లేస్టోర్‌ ద్వారా దీక్షా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఆయా అంశం వద్ద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని వీడియో, మొబైల్, ప్రొజెక్టర్ల ద్వారా వీక్షించడానికి దోహదపడుతుంది. దీక్ష యాప్‌ను పొందుపర్చిన మొబైల్‌ ఫోనుతో ఆ కోడ్‌ను స్కాన్‌ చేసినప్పుడు.. నేరుగా యూట్యూబ్‌కు అనుసంధానమవుతుంది. అనంతరం విద్యార్థులకు అర్థమయ్యేలా బొమ్మలతో విషయ నిపుణులు విశ్లేషణాత్మకంగా బోధిస్తూ రూపొందించిన పాఠాలు ప్రత్యక్షమవుతాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కంప్యూటర్ల రూపకల్పన, వర్చువల్‌ తరగతులు, డిజిటల్‌ తరగతులను నిర్వహించడానికి కావలసిన సదుపాయాలను కల్పించడం, అటల్‌ టింకరింగ్‌ ప్రయోగశాలలు వంటి అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ఈ తరుణంలో క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఇక్కడి విద్యార్థులు కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అభ్యసించడానికి మంచి అవకాశం.