హైద్రాబాద్, ఆగస్టు 23(way2newstv.com):
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను ఆగస్టు 26 వరకు అరెస్ట్ చేయరాదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. అయితే, ఈ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై మాత్రం విచారణను ఆగస్టు 26కి వాయిదా వేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు మందస్తు బెయిల్ నిరాకరించడంతో ఆయన బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
చిదంబరానికి స్వల్ప ఊరట
ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ అభ్యర్థననను న్యాయమూర్తి జస్టిస్ వైవీ రమణ ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ పరిశీలన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దీంతో చిదంబరం బెయిల్ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ గొగొయ్.. శుక్రవారం విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ తరఫున అదనపు సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కాగా, చిదంబరానికి బెయిల్ మంజూరు విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోడానికి ముందు కేసు పూర్వాపరాలను న్యాయమూర్తి పరిశీలించాలని ఆయన కోరారు. చిదంబరానికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే కీలక విషయాలు ఎప్పటికే వెల్లడయ్యే అవకాశం ఉండదు కాబట్టి, ఈడీ విచారణకు ఆయనను అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, దేశంతోపాటు విదేశాల్లో ఎలాంటి సంస్థలను ఏర్పాటుచేయకుండా నిధులను ఎలా కొల్లగొట్టారో రాబట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా విచారించాలని పేర్కొన్నారు. మొత్తం 17 విదేశీ బ్యాంకుల్లో చిదంబరం ఖాతాలను కలిగి ఉన్నారని న్యాయస్థానానికి వివరించారు. హైడ్రామా అనంతరం బుధవారం సాయంత్రం చిదంబరాన్ని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఆయనను ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, లోతైన దర్యాప్తు కోసం ఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. చిదంబరం ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఆ కస్టడీ సోమవారం పూర్తవనున్నందున అదే రోజున ఆయన అరెస్టు పిటిషన్‌పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.