రెవెన్యూ శాఖ ప్రక్షాళన స్కామ్రెవెన్యూ శాఖ ప్రక్షాళన స్కామ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెవెన్యూ శాఖ ప్రక్షాళన స్కామ్రెవెన్యూ శాఖ ప్రక్షాళన స్కామ్

హైద్రాబాద్, ఆగస్టు 23 (way2newstv.com):
తెలంగాణలో రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేపడతామంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన వెనక ఏదో భారీ కుట్ర దాగి ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రెవెన్యూ శాఖను కొనసాగించాలనుకుంటుందా? తొలగించాలనుకుంటుందా అని ప్రశ్నించారు. రెవెన్యూ విభాగాన్ని తొలగించాలనుకుంటే ప్రజలు, ప్రతిపక్షాలతో కలసి చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని నిలదీశారు.రాష్ట్రంలో ప్రతి రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి కేసీఆర్ కుట్ర పన్నారని బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపించారు. 
రెవెన్యూ శాఖ ప్రక్షాళన స్కామ్

ఇంటర్మీడియెట్ పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేయడానికి ఎలాంటి అనుమతులు, టెండర్లు లేకుండానే గ్లోబరీనా అనే సంస్థలకు అప్పగించి పదుల సంఖ్యలో విద్యార్థుల మరణాలకు కారణమయ్యారని మండి పడ్డారు. అదేవిధంగా ధరణి వెబ్‌సైట్, రెవెన్యూ సంస్కరణలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఐఎల్ఎఫ్ఎస్ అనే సంస్థకు భూ రికార్డుల కంప్యూటరీకరణను అప్పగించిందని తెలిపారు. దీని వెనక పెద్ద మోసం దాగి ఉందని ఆరోపించారు. కంప్యూటరీకరణ లోపాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖను రద్దు చేయనున్నట్లు ఇటీవల రెండు రోజులపాటు నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ కలెక్టర్లకు చెప్పినట్లు సమాచారం ఉందన్నారు. ఈ విషయాన్ని బయటికి చెప్తే చర్యలు తీసుకుంటామని సీఎం కలెక్టర్లను హెచ్చరించారని ఆరోపించారు. రెవెన్యూశాఖను రద్దును బీజేపీ వ్యతిరేకిస్తుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. రెవెన్యూ ఉద్యోగులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. భూప్రక్షాళన పేరుతో చేస్తోన్న అక్రమాలను అడ్డుకోవడానికి బీజేపీ చేయబోయే ఉద్యమాలకు రెవెన్యూ సంఘాలు సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా పహాణీల నుంచి కబ్జాదారుల వరుసను తొలగించడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని రఘునందన్ రావు తెలిపారు. గ్రామాల్లో రైతుబంధు చెక్కులు, పట్టా పుస్తకాలు అందక రైతులు, పింఛన్లు రాక వికలాంగులు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కుంటున్నారని తెలిపారు. 2017 నుంచి 2019 వరకు తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు ఏమిటని ప్రశ్నించారు.