విజయవాడ, ఆగస్టు 23 (way2newstv.com):
ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ 68వ గేటు వద్ద అడ్డంగా చిక్కుకున్న బోటు వల్ల ఇలా నీరంతా వృథా అవుతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో.. బ్యారేజీకి ఇన్‌ఫ్లో తగ్గింది. దీంతో 70 గేట్లను మూడు రోజుల క్రితం మూసివేశారు. కానీ పడవ అడ్డుపడటంతో ఈ గేటును మూసివేయడం మాత్రం కుదర్లేదు. బోటును తీయడానికి రకరకాలుగా ప్రయత్నించినప్పటికీ.. అవేవీ వర్కవుట్ కాలేదు. దీంతో బోటును అలాగే వదిలేశారు.
ఆ బోటు చూట్టూనే రచ్చ
ఈ గేట్ ద్వారా ఇప్పటికీ నీరు సముద్రంలోకి పోతోంది. ప్రకాశం బ్యారేజీ నిల్వ సామర్థ్యం కేవలం 3 టీఎంసీలు మాత్రమే. ఇలా నీరంతా వృథాగా పోతుంటే.. మరో నాలుగురోజుల్లో బ్యారేజీలోని నీరంతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ బోటే కొద్ది రోజుల క్రితం టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఇటీవల కృష్ణా నదికి భారీగా వరద రాగా.. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద ఈ బోటు కొట్టుకొచ్చింది. తమ ఇంటిని ముంచడం కోసం.. నీరు దిగువకు వెళ్లకుండా ఉండటానికి వీలుగా ప్రభుత్వం ఈ బోటును గేట్లకి అడ్డం పెట్టిందని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. టీడీపీ నేత వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్సీపీ కూడా ఘాటుగానే స్పందించింది. బోట్లు అడ్డుపెట్టి పెట్టి వరదను ఆపడం సాధ్యమేనా? అని ప్రశ్నించింది. వరద ఆపడానికి కారణమైందంటూ నిన్న మొన్నటి వరకు టీడీపీ నేతలు ఆరోపించిన అదే బోటు నేడు ప్రకాశం బ్యారేజీ జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్లడానికి కారణమవుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లో నీటిని దిగువకు విడుదల చేసే గేట్ల వద్ద ఓ బోటు ఇరుక్కుపోవడం మీడియాలో ప్రముఖంగా కనిపించింది. బోటు కారణంగా గేట్లు మూసేందుకు వీల్లేకుండా పోయింది. దాంతో నీరు దిగువకు వెళ్లిపోతూ వృథాగా సముద్రం పాలవుతోంది. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. అయ్యా మంత్రి అనిల్ గారూ, ప్రకాశం బ్యారేజ్ ఖానాలో ఓ పడవ ఇరుక్కుపోయి మొత్తం జలవనరుల శాఖను అతలాకుతలం చేస్తోందని, అన్ని పనులు ఆపి ముందా పడవను తొలగించండి అంటూ ట్వీట్ చేశారు. ఆ బోటు కారణంగా వేలాది క్యూసెక్కుల నీరు వృధా అవుతోందని తెలిపారు. అందరూ మీకు మాటలెక్కువ, చేతలు తక్కువ అంటున్నారని వర్ల రామయ్య తన ట్వీట్ లో పేర్కొన్నారు.