తిరుపతి, ఆగస్టు 23 (way2newstv.com):
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో మరోసారి అన్యమత ప్రచారం వివాదాస్పదమవుతోంది. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్లపై హజ్, జెరూసలేం యాత్రకు సంబంధించిన ప్రకటనలు ముద్రించారు. దీనిపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారుల తీరును గర్హిస్తూ ఇది కేవలం దురుద్దేశపూరితంగా చేసిన చర్యగా దుయ్యబడుతున్నారు. ఇది మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ టికెట్లు పొరపాటున ఇటు వచ్చాయని అంటున్నారు. వేరే రూట్లో వెళ్లే బస్సులపై ఇవ్వాల్సిన ప్రకటన ఇటు వైపు వచ్చిందని సమర్దించుకుంటున్నారు.
తిరుమలలో అన్యమత ప్రచారం...
కాగా, ఈ టిక్కెట్లన్నీవిజయవాడ కేంద్రంగా ముద్రితమవుతున్నట్లు తెలుస్తోంది. కోట్లాది మంది ఆరాధ్య దైవంగా పూజలందుకునే తిరుమల శ్రీవారి ఆలయంలో అన్యమత ప్రచారం ఎందుకు జరుగుతోందన్న ఆందోళన భక్తుల్లో నెలకుంది. కలనైనా సప్తగిరులపై అన్యమత ప్రచారం ఊహించుకోలేని భక్తులకు ఇది తీవ్ర మనస్తాపం కలిగిస్తోంది. సాక్షాత్ ప్రభుత్వ సంస్థగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ దీనిపై ప్రచారం చేయటం ఏంటని విమర్శలు వ్యక్తమయ్యాయి. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పరోక్షంగా ఇలాంటి ప్రచారం చేయిస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు. దీనిపై టీడీపీ పాలకమండి మాజీ సభ్యుడు ఓవి రమణ మాట్లాడుతూ.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత యాత్రల గురించి ప్రచారం చేయడం దుర్మార్గమని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్‌గా నియమితులైన సుబ్బారెడ్డి అన్యమతస్తులు కావడంతోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని రమణ ధ్వజమెత్తారు. పాలకమండలి రద్దు చేసి రెండు నెలలు అయినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో కొత్త బోర్డును ఏర్పాటు చేయకపోవడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి అని ఆయన వ్యాఖ్యానించారు.
Tags:
Andrapradeshnews