ప్రకాశంలో రైతన్న మోదం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రకాశంలో రైతన్న మోదం

ఒంగోలు, ఆగస్టు 17, (way2newstv.com)
ప్రకాశం జిల్లాల్లో వారం రోజులుగా వాతావరణం మారింది. చినుకులు, చిరుజల్లులతో ఊరట కలుగుతోంది. బీడువారిన భూములు కాస్త మెత్తబడుతున్నాయి. రైతన్నకు ఖరీఫ్‌ ఆశలు మొలకెత్తేలా చేస్తున్నాయి. ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 2.26 లక్షల హెక్టార్లు. జులై 25 నాటికి జిల్లాలో కేవలం 11 శాతమే అంటే 24 వేల హెక్టార్లలో మాత్రమే సాగు ఆరంభించారు. ప్రస్తుతం మాత్రం 58 వేల హెక్టార్లకు సాగు పెరిగింది. దాదాపు 25 శాతంలో నాట్లు పడ్డాయి. ఇదేతీరున మరో పక్షం రోజులు వర్షాలు కురిస్తే ఖరీఫ్‌ నాట్లు 70 శాతానికి చేరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువగా కంది, అపరాలు, మిర్చి, పత్తి పంటలు సాగు చేయాల్సి ఉంది. పశ్చిమాన ఎక్కువగా యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల్లో పత్తి, కంది సాగు చేపడుతున్నారు. వీటిలో ఎక్కువగా బీడు భూములే ఉండగా, ఈ వర్షాలతో ఇటీవల భూములు కాస్త అనుకూలంగా మారుతున్నాయి. 
ప్రకాశంలో రైతన్న మోదం

నాట్లు పడిన చోట కూడా మొలకల దశలో ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో రైతులు దుక్కు ఆరంభించారు.జిల్లాలో 50 శాతం లోటు వర్షపాతం ఉండగా, ప్రస్తుతం 32.1 శాతానికి చేరింది. లోటును భర్తీ చేస్తూ గత వారం రోజులుగా వరుణుడు వర్షిస్తుండడం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పంటలకు, నేలలకు ఊపిరి పోసినట్టే. ఇదే ఊపుతో ఖరీఫ్‌ పనులు కూడా ఊపందుకున్నాయి. ఆగస్టులోనే చూసుకుంటే ఈ పక్షం రోజుల్లో సాధారణ వర్షపాతం 45.2 మిల్లీ మీటర్లు ఉండగా, ఇప్పటి వరకు 53.3 మి.మీ. కురిసింది. మొత్తానికి ఈ సీˆజన్‌లో సాధారణ వర్షపాతం 193 మిల్లీమీటర్లు ఉండగా, ఇప్పటి వరకు 131.1 మిల్లీమీటర్లు కురిసింది. గడిచిన వారం రోజులుగా సగటున రోజుకి 8 మిల్లీమీటర్లు కురుస్తోంది. జిల్లాలో ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో కురిసే వర్షమే కీలకం. ఆగస్టులో మరో 70 మిల్లీమీటర్లు కురిసి, సెప్టెంబరు నెలలో 200 మిల్లీమీటర్లు కురిస్తే ఖరీఫ్‌ కాస్త గట్టెక్కుతుంది. రానున్న 50 రోజులు ఖరీఫ్‌ పంటలకు కీలకంగా మారింది. ఈ వర్షాలతోనే ఓ వైపు వర్షాధార పంటలు, మరోవైపు సాగర్‌ జలాల ఆధారంగా మాగాణి పంటలు కూడా సాగు చేయాల్సి ఉంది. సాగర్‌ పరీవాహకంలోని 24 మండలాల్లో ఇప్పటికీ సాగు అనుమానాస్పదంగానే ఉంది. అద్దంకి, దర్శి, చీమకుర్తి ప్రాంతాల్లో ఇంకా ఆరంభం కాలేదు. పర్చూరు, చీరాల పరిధిలో పట్టిసీˆమ నీటితో వరి నాట్లు జోరుగా వేస్తున్నారు.