హైద్రాబాద్, సెప్టెంబర్ 26, (way2newstv.com)
రాష్ట్రంలో రెండో దఫా కూడా వరుస విజయం సాధించి అధికారంలోకి రావాలని ప్రయత్నించినా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నం ఫలించలేదు. అంతేకాదు, గెలుపు గుర్రం ఎక్కుతారని నూటికి నూరుపాళ్లు భావించిన నాయకులు కూడా పల్టీ కొట్టారు. జిల్లాలకు జిల్లాల్లోనే టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీంతో టీడీపీ నేతల్లో నైరాశ్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోయింది. చాలా చోట్ల పార్టీ ఓడిపోయినా నేతలు కొంత ధైర్యం తెచ్చుకుని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అయితే, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఓడిపోయిన నాయకులు నియోజకవర్గాల్లో కనిపించడం కాదు కదా ఏకంగా పార్టీ మారిపోయేందుకు రెడీ అయ్యారు.
టీడీపీకి 25 నియోజకవర్గాల్లో ఆశలు ల్లేవా
మరి ఇలాంటి నియోజకవర్గాల్లో పార్టీ అధినేతగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుని, పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఎంతో ఉంది. త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉన్న క్యాడర్‌ను నిలబెట్టుకుని, వారిలో ధైర్యం నూరిపోసి.. ముందుకు నడిపించడం ద్వారా పోగొట్టుకున్న చోటే ఫలితాన్ని రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఎన్నికలు జరిగిన మూడు మాసాలు దాటిపోయినా.. పార్టీలో నేతలు జంప్ అయిపోతున్నా.. చంద్రబాబు మాత్రం ఈదిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్లలేదనే చెప్పాలి.నాయకులు ఓడిపోయి.. పార్టీ పరిస్థితిని కూడా పట్టించుకోకుండా తమ సొంత వ్యవహారాల్లో మునిగి తేలుతున్న నియోజకవర్గాలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. మరి ఇలాంటి చోట్ల కొత్త రక్తానికి అవకాశం ఇప్పుడే ఇవ్వడం వల్ల పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది. తద్వారా పార్టీలోనూ నూతనోత్తేజం పొంగిపొర్లుతుంది. ఆ నియోజకవర్గాల్లో మచ్చుకు కొన్ని తీసుకుంటే.. అనంతపురం జిల్లా శింగనమల, తాడిపత్రి (ఇక్కడ జేసీ వర్గానిదే హవా. అయితే, ఇప్పుడు వారు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.), ధర్మవరం, విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం, ఆచంట(ఇక్కడ కూడా మాజీ మంత్రి సత్యనారాయణ పార్టీ మారతారనే టాక్ వినిపిస్తోంది. ఆయన చురుగ్గా ఉండడం లేదు).తుని (యనమల రాజకీయం ఇక్కడ క్లిక్ కాలేదు. మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది) శ్రీకాకుళం జిల్లా పలాస(గౌతు శిరీష కూడా పెద్దగా క్లిక్ కాలేదు. ఆమెను జిల్లా ఇంచార్జ్‌గానే ఉంచి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి). ఇక గుంటూరు జిల్లాలో కోడెల మృతితో నరసారావుపేట, సత్తెనపల్లి రెండు నియోజకవర్గాలతో పాటు బాపట్ల, గుంటూరు తూర్పు, మాచర్ల నియోజకవర్గాల్లోనూ బలమైన అభ్యర్థులకు బాధ్యతలు ఇవ్వాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడులో మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ టీడీపీలో కొనసాగే ఉద్దేశంలో లేరని తెలుస్తోంది. ఇక పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కర్రా రాజారావు రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి లేదు. ఇలా ఏపీలో మొత్తం 25 నియోజకవర్గాల్లో పరిస్థితి టీడీపీకి అంత అనుకూలంగా లేదు. ముందు వీటి సంగతిని చంద్రబాబు తేల్చుకుంటే మంచిదనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ, చంద్రబాబు ఇప్పట్లో వీటిపై దృష్టి పెట్టే అవకాశం కనిపించకపోవడంతో పార్టీ శ్రేణులు డీలా పడుతున్నాయి. దీనిని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకునే ఛాన్స్ కనిపిస్తోంది.