విజయవాడ, సెప్టెంబర్ 26, (way2newstv.com)
లింగమనేని రమేష్… ఈపేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ అయింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందిన లింగమనేని రమేష్ నివాసాన్ని కూల్చేవేసేందుకు ఇటీవల సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. కృష్ణా నది కరకట్ట మీద లింగమనేని రమేష్ గెస్ట్ హౌన్ ను నిర్మించుకున్నారు. ఆయన అన్ని అనుమతులు తీసుకునే తాను కరకట్ట పై గెస్ట్ హౌన్ ను నిర్మించుకున్నానని లింగమనేని రమేష్ చెబుతున్నారు. ఇటీవల కురిసన వర్షాలు, వరదలకు కృష్ణా నీరు లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ లోకి రావడంతో ఇది మరింత చర్చనీయాంశమైంది. నిజానికి లింగమనేని రమేష్ పారిశ్రామికవేత్తగానే కాదు రాజకీయ నేతలతో సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడన్న పేరుంది. అందుకే లింగమనేని రమేష్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన గెస్ట్ హౌస్ ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నివాసంగా ఇచ్చారు.
కోర్టు మెట్లెక్కిన లింగమనేని
హైదరాబాద్ నుంచి అప్పుడే వచ్చిన చంద్రబాబు తన భద్రతా కారణాల దృష్ట్యా లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ అయితే బాగుంటుందని భావించి ఆయనను సంప్రదించడంతో వెంటనే ఓకే చెప్పారు.ఇక తెలుగుదేశం పార్టీ అధినేతతోనే కాదు లింగమనేని రమేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా సన్నిహితులే. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరిక వెనక కూడా లింగమనేని రమేష్ ఉన్నారని అంటారు. అమరావతికి సమీపంలో నిర్మించిన వెంకటేశ్వరస్వామి ఆలయం ప్రారంభోత్సవానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను ఇద్దరినీ ఆహ్వానించారు. అంతేకాదు గత ఎన్నికల్లో జనసేన, టీడీపీ ల మధ్య పొత్తు కుదుర్చడానికి లింగమనేని రమేష్ గట్టిగానే ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించినా పవన్ కల్యాణ్ మాత్రం లింగమనేని రమేష్ కు సున్నితంగా నో చెప్పినట్లు తెలుస్తోంది.ఇప్పుడు కరకట్ట మీద ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ ను కూల్చి వేయడం ఖచ్చితంగా జరుగుతుంది. లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ అక్రమ కట్టడమేనని తేల్చారు. ఇప్పటికే కరకట్ట మీద ఉన్న కొన్ని అక్రమ కట్టడాలను కూల్చి వేసే ప్రక్రియను సీఆర్డీఏ ప్రారంభించింది. దీంతో లింగమనేని రమేష్ జగన్ కు నేరుగా లేఖరాయడం కూడా అదే కారణమంటున్నారు. ఇప్పటికే దీనిపై లింగమనేని రమేష్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. పారిశ్రామికవేత్తలను ఇలా ప్రభుత్వం వేధిస్తే రాష్ట్రా భివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. లింగమనేని రమేష్ ఎయిర్ కోస్తా కంపెనీ ఛైర్మన్ గా ఉన్నారు. అలాగే అనేక పరిశ్రమలను ఆయన నిర్వహిస్తున్నారు. 2014 తర్వాత తాను ప్రభుత్వం నుంచి ఏమాత్రం లబ్దిపొందలేదని లింగమనేని రమేష్ చెబుతున్నారు. మొత్తం మీద లింగమనేని రమేష్ జగన్ కు లేఖ రాయడం వెనక కూడా రాజకీయం దాగి ఉందని వైసీపీ భావిస్తుంది.