న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18, (way2newstv.com)
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఝలక్ ఇవ్వబోతోందా? నివేదికలు మాత్రం అవుననే సమాధానం చెబుతున్నాయి. మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు తగ్గించాలని భావిస్తోందట. పదవీ విరమణకు సంబంధించిన ఈ కొత్త నిర్ణయం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రావొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.ప్రతిపాదనల ప్రకారం.. ఉద్యోగుల రిటైర్మెంట్ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి 33 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకోవడం లేదా ఉద్యోగికి 60 ఏళ్ల వయసు రావడం అనే అంశాల ప్రాతిపదికన రిటైర్మెంట్ ఆధారపడి ఉంటుంది.ఐఏఎస్, ఐపీఎస్ నుంచి సెక్యూరిటీ ఫోర్సెస్ వరకు అన్ని జాబ్స్‌కు ఈ కొత్త రూల్ వర్తించే అవకాశముంది. ప్రస్తుతం చాలా వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది.
కేంద్రంలో 55 ఏళ్లకే రిటైర్మెంట్..?
రిటైర్మెంట్ వయసు తగ్గింపు ప్రతిపాదన కొత్తదేమీ కాదని, ఏడవ వేతన సంఘం సిఫార్సులలోనూ ఈ అంశం ప్రస్తావన ఉందని కేంద్రం పేర్కొంటోంది.రిటైర్మెంట్ కొత్త రూల్‌కు సంబంధించి పనుల ఇప్పటికే ప్రారంభమయ్యాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనెల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) తెలిపింది. కొత్త రూల్ దశల వారీగా అమలులోకి రావొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ఒకవేళ కొత్త రూల్ అమలులోకి వస్తే సెక్యూరిటీ ఫోర్సెస్‌పై ఎక్కువ ప్రభావం పడొచ్చనే అంచనాలున్నాయి. సెక్యూరిటీ ఫోర్సెస్‌లో జాయింగ్ ఏజ్ సగటున 22 ఏళ్లుగా ఉంది. వీరి 33 ఏళ్ల సర్వీస్ 55 ఏళ్లకే పూర్తివుతుంది. అంటే వాళ్లు అప్పుడే రిటైర్మెంట్ తీసుకోవాలి. దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం కొంత మేర ఉపయోగపడొచ్చని కేంద్రం భావిస్తోంది.ఇకపోతే గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో నిరుద్యోగిత 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ విషయమై మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నాయి. ఉపాధి కల్పన ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నాయి.
Tags:
all india news