రాష్త్రాలకు పడిపోతున్న ఆదాయాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాష్త్రాలకు పడిపోతున్న ఆదాయాలు

హైద్రాబాద్, సెప్టెంబర్ 4, (way2newstv.com)
ప్రజలకే కాదు, ప్రభుత్వాలకూ ఇది కష్టకాలమే. ఆదాయం పడిపోతోంది. అంచనాలు తలకిందులవుతున్నాయి. చేయాల్సిన పనులు చూస్తే కొండంతగా పెరిగి భయం పుట్టిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అటు కేసీఆర్, ఇటు జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆర్థికపరిస్థితిపై సమీక్షించారు. ఆదాయం తగ్గిపోతున్న స్థితికి ప్రత్యామ్నాయం ఏమిటో యోచించాలని ఉన్నతాధికారులకు సూచించారు. అదనపు ఆర్థిక వనరులు మాత్రం కనిపించడం లేదు. మరోవైపు కేంద్రప్రభుత్వమూ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రిజర్వ్ బ్యాంకు నుంచి భారీగానే నిధులను తీసుకుంటున్నప్పటికీ గట్టెక్కే సూచనలు కనిపించడం లేదు. వ్యవస్థలో చలనం లేకపోవడం వల్ల మొత్తం స్తబ్ధత ఏర్పడింది. 
రాష్త్రాలకు పడిపోతున్న ఆదాయాలు

తుపాను ముందటి ప్రశాంతతను ఆర్థిక వాతావరణం తలపింపచేస్తోంది.సంక్షేమం, సామాజిక న్యాయం, సాధికారత త్రిసూత్రాలుగా పరిపాలన కొనసాగించాలని నిర్ణయించుకున్న జగన్ కు తీవ్రమైన అవరోధాలే ఎదురవుతున్నాయి. రికార్డు మెజార్టీతో అసెంబ్లీలో ఎదురు లేకుండా చేసుకున్న వైసీపీకి ఇప్పట్లో తిరుగులేదని పరిశీలకులు భావించారు. ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలు, సలహాదారుల వైఫల్యాలతో ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చేలా చేస్తున్నారు. ఫలితంగా రాజకీయ పరమైన అంశాలపై ఫోకస్ పెరిగిపోతోంది. పడిన తొలి అడుగుల ఫలితం చేతికి అందిరాకముందే చేజారిపోతోంది. ఈ జగడాల జంజాటంలో పడి ఆర్థికస్థితిపై సమగ్ర కార్యాచరణకు సమయం చిక్కడం లేదు. దేశీయంగా నెలకొన్న మాంద్యం పరిస్థితుల వల్ల సహజంగానే రాష్ట్రంలోనూ కొన్ని లక్షలమంది ఉపాధి కోల్పోయారు. దీనికి రాష్ట్రప్రభుత్వ తప్పిదాలు కూడా తోడయ్యాయి. ఇసుక విధానంపై తక్షణ కార్యాచరణ లేకపోవడంతో నిర్మాణరంగంలో పనులు నిలిచిపోయాయి. కార్మికులు వేల సంఖ్యలోనే రోడ్డునపడ్డారు. రాజధాని నిర్మాణపనులు నిలిచిపోవడమూ ఇబ్బందికరంగా మారింది. అటు ప్రభుత్వ ఇటు ప్రయివేటు పనుల్లో మందకొడి తనం ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతోంది.వచ్చే ఒకటి రెండునెలల్లో ఎదురుకానున్న ఖర్చులు ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. కేంద్రంలో మంత్రులను కలిసిన సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్రమైన వివరాలనే ముఖ్యమంత్రి జగన్ విశదీకరించారు. అయితే పెదవులపై సానుభూతే తప్ప పైసలు విదిల్చే ధోరణి కేంద్రంలోకనిపించలేదు. అక్టోబర్ లో రైతు భరోసా వంటి భారీ పథకాన్ని చేపట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జీతాలకే కటకటలాడుతున్న స్థితి. పింఛన్లు, జీతాలను సకాలంలో చెల్లించకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అంతేకాదు యాంటిసెంటిమెంటు చాలా వేగంగా ప్రబలుతుంది. రాజధాని నిర్మాణ పనుల్లోవేగం తగ్గించడంలో సైతం ప్రభుత్వ వ్యూహం దాగి ఉందనేది ప్రభుత్వ వర్గాల భావన. ఇప్పటికే ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్ల రూపాయల్లోకి చేరాయి. వాటిని తక్షణం చెల్లించకపోయినా వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు క్లియర్ చేయాల్సి ఉంటుంది. పనులు కొనసాగిస్తే చెల్లింపుల ఒత్తిడి మరింతగా పెరిగిపోతుంది. అందుకే ముందుగా పనులన్నిటినీ రివ్యూ చేసేవరకూ ముందడుగు వేయకూడదనుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ముందుగా రాష్ట్రప్రభుత్వం ఖర్చుపెట్టిన తర్వాతనే కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం ఆ వెసులుబాటు కూడా ప్రభుత్వానికి లేదు. రోజువారీ వ్యయానికే వెదుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.రానున్న నాలుగు నెలల అవసరాలు, చెల్లింపులు, సాధారణ నిర్వహణ వ్యయాలకు ప్రభుత్వ ఆదాయానికి అదనంగా 20వేల కోట్ల రూపాయల వరకూ అవసరమవుతాయని అంచనా. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఖజానా ఖాళీ అయిపోయింది. నెలకి రెండువేల అయిదు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్ల వరకూ ఆదాయ వ్యయాల్లో తేడా వస్తోంది. జనవరి నుంచి పన్ను వసూళ్లు, కేంద్రప్రభుత్వ నిధుల విడుదలకు సంబంధించిన మొత్తాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం కటకటే. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న పథకాలకు కనీసం ఎనిమిదివేల కోట్ల రూపాయలు, ఖర్చుల్లో తేడాకు గాను పన్నెండువేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. బాండ్ల రూపంలోనూ, కార్పొరేషన్ల రుణాల రూపంలోనూ వీటిని సేకరించాలి. అందులోనూ ఎఫ్ఆర్బీఎం చట్టానికి దొరకకుండా తెలివిగా ఈ నిధులను మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి. ప్రస్తుతమున్న ఆర్థిక వాతావరణంలో ఆదాయపెరుగుదల పెద్దగా ఉండదని నిపుణులు తేల్చేస్తున్నారు. అందువల్ల మార్కెట్ రుణాలే శరణ్యమని చెప్పాలి.ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ ఆర్థికంగా సంపన్న రాష్ట్రం. అంతేకాదు, ఆదాయం కూడా ఎక్కువే. హైదరాబాద్ ప్రధాన వనరుగా ఉండటంతో ఆదాయం పెద్దగా పడిపోలేదు. అయితే ఏటా కనిపించే వృద్ధి రేటు తగ్గిపోయింది. ఈ విషయమే ప్రభుత్వానికి ఆందోళనకరంగా మారింది. ఏటా ప్రభుత్వ ఆదాయం పెరుగుతూ ఉంటుందనే అంచనాలతో తెలంగాణ సర్కారు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసింది. ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారానూ రుణసమీకరణ చేపట్టింది. కానీ ఇప్పుడు జాతీయంగా ఏర్పడిన మాంద్యం వాతావరణం హైదరాబాద్ నగరంపై ప్రభావం చూపుతోంది. వాహనాల కొనుగోళ్లు తగ్గిపోవడం, వినియోగ వస్తువుల డిమాండ్ పడిపోవడంతో పన్నుల రూపేణా రావాల్సిన ఆదాయం తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఇదే విషయంపై దృష్టి సారించారు. పన్ను వసూళ్లు పెంచడంతోపాటు ప్రభుత్వ వ్యయంలో పొదుపు పాటించడం ద్వారా రెవిన్యూ అంతరాలను పూడ్చుకోవాలని భావిస్తున్నారు. అత్యవసర చెల్లింపులు మినహా సాధారణ పాతబకాయిల చెల్లింపులకూ స్వస్తి పలికారు. మొత్తమ్మీద కేంద్రం తనకుండే ప్రత్యేక మార్గాల ద్వారా కొంత వెసులుబాటు పొందేందుకు అవకాశం ఉంది. ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రలు జగన్, కేసీఆర్ లకు మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చు.