రెట్టింపైన ఉల్లి ధరలు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెట్టింపైన ఉల్లి ధరలు...

విజయనగరం, సెప్టెంబర్ 26, (way2newstv.com)
ఉల్లి ధర నెల రోజుల్లో వంతుకు వంతు పెరిగింది. సెప్టెంబరు ఒకటో తేదీ నాటికి తెలుపు(పెద్ద) ఉల్లి బహిరంగ మార్కెట్‌లో కేజీ రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.40కు పెరిగింది. కనీసం నాలుగైదు రూపాయిలు తేడా ఉండే రైతు బజారులో కూడా బుధవారం రూ.35 ఉంది. ఇక జిల్లాలో అంతగా వినియోగించని కర్నూలు ఉల్లి ధర కూడా ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కేజీ రూ.35 ఉంటే రైతుబజారులో రూ.32 ఉంది. దీని ధర కూడా 20రోజుల్లో వంతుకు వంతు పెరగడం విశేషంఉల్లి ధరలు భారీగా పెరగడానికి సరుకు కొరత కారణం. జిల్లాకు మహారాష్ట్ర నుంచి సరుకు వస్తుంది.  కర్నూలు నుంచి కొంత సరుకు వస్తుంది.  అక్కడ ప్రస్తుతం సరుకు తక్కువగా ఉంది. వర్షాలు పడుతుండడంతో పంట తీసే పరిస్థితి లేక కొరత ఏర్పడింది. ఫలితంగా ఇక్కడ వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. 
రెట్టింపైన ఉల్లి ధరలు...

మళ్లీ అక్కడ సరుకు ఎక్కువగా దొరికే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా వ్యాపారులు ధరలు మరింత పెరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. సాధారణంగా ఉల్లి ధర కాస్తా పెరిగినపుడు వ్యాపారులు మరింత డిమాండ్‌ సృష్టించడం జిల్లాలో పరిపాటి. సరుకు రావడం లేదని, తక్కువ సరుకు ఉందని చెప్పి రోజురోజుకు ధర పెంచుతూ వెళ్తారు. వాస్తవానికి ఉల్లి కుళ్లిపోయే సరుకు కావున కొనుగోలు ఆపేస్తే ధర తగ్గుతుంది. కానీ రోజువారీ అవసరాలకు ఉల్లి తప్పనిసరి కావడంతో జనాలు కొనుగోలు చేయకతప్పని పరిస్థితి. దీంతో చిల్లర వర్తకులు వద్ద హోల్‌సేల్‌ వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతుంటారు. ఈ భారం చివరికి వినియోగదారులపైనే పడుతుంది. ప్రస్తుతం ఉన్న సరుకు కొరత, డిమాండ్‌ను అడ్డం పెట్టుకునే ధరలు పెరుగుతాయని ముందే ప్రచారం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు మానసికంగా సిద్ధమై పెంచినా కొంటారని వ్యాపారులు ఆలోచన. ఇదిలా ఉండగా ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెప్పడంతో వినియోగదారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఉన్న ధరతో సర్దుకుంటున్నామని, మరింత పెరిగితే ఇబ్బందేనని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ డిమాండ్‌ రాకుండా అధికారులు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది.